స్లమ్ డాగ్ ఆలోచిస్తోంది వీటి గురించే

విజయ్ సేతుపతి – దర్శకుడు పూరి జగన్నాథ్ కలయికలో తెరకెక్కుతున్న సినిమాకు ముందు నుంచి అనుకున్నట్టుగా స్లమ్ డాగ్ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు. హీరో పుట్టినరోజు సందర్భంగా వదిలిన లుక్ మంచి ఇంటెన్స్ గా ఉంది. 33 టెంపుల్ రోడ్ అని ఉప శీర్షిక పెట్టారు.

అయితే పోస్టర్ లో విడుదల తేదీ ప్రస్తావన లేదు. కమింగ్ సూన్ లేదా సమ్మర్ 2026 అని ఏదోకటి హింట్ ఇవ్వడం లాంటివి కనిపించలేదు. అంటే రిలీజ్ డేట్ కి సంబంధించిన కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదన్న మాట. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దునియా విజయ్, టబు ఇతర కీలక పాత్రలు పోషించారు.

స్లమ్ డాగ్ రాకని డిసైడ్ చేయాలంటే ముందు కొన్ని సమస్యలున్నాయి. వాటిలో ప్రధానమైంది సరైన రిలీజ్ స్లాట్ దక్కించుకోవడం. మంచి క్యాస్టింగ్, కంటెంట్, బడ్జెట్ ఉన్న సినిమాలకు ఫిబ్రవరి అంత రైట్ సీజన్ కాదు. అయినా రిస్క్ చేయాలంటే మొదటి వారమే బెటర్. కానీ పూరికి ఆ ఆలోచన లేనట్టు కనిపిస్తోంది.

పోనీ మార్చి అనుకుంటే మొదటి రెండు వారాలు మాత్రమే ఖాళీ ఉన్నాయి. మూడో వారం దురంధర్ 2, టాక్సిక్, డెకాయిట్ ఆ తర్వాత పెద్ది, ప్యారడైజ్ మూకుమ్మడిగా దాడి చేస్తాయి. వీటిని తట్టుకోవడం అంతే ఈజీ కాదు. అన్నింటి కన్నా ముఖ్యంగా స్లమ్ డాగ్ బృందానికి ఇంకో చిక్కు ఉంది.

ఎట్టి పరిస్థితుల్లో జన నాయకుడు దగ్గరలో క్లాష్ పడకూడదు. జనవరి 20 హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఏదైనా క్లారిటీ వచ్చి కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారేమో అని కోలీవుడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. మన కన్నా ఎక్కువ స్లమ్ డాగ్ కు తమిళ మార్కెట్ చాలా కీలకం.

జన నాయకుడు ఫిక్స్ అయితే దానికి ముందు వెనుకా కనీసం రెండు వారాలు స్పేస్ వదలడం చాలా ముఖ్యం. లేదంటే చాలా రిస్క్ అయిపోతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పూరి బృందం ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంది. ఓటిటి డీల్ కూడా చివరి దశలో ఉందట. ఖచ్చితంగా కంబ్యాక్ అవ్వాలనే కసితో పూర్తి జగన్నాథ్ దీనికి చాలా కష్టపడ్డారు.