చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ ఎట్టకేలకు విడుదల కానుంది. మే 1 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు ఇవాళ అఫీషియల్ గా టీజర్ తో పాటు అనౌన్స్ చేశారు. విజయం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేస్తున్న అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ లవ్ కం ఎమోషనల్ డ్రామాలో కంటెంట్ పరంగా మరీ కొత్తగా ఏం కనిపించడం లేదు.
ఈ మధ్య సయారా, తేరే ఇష్క్ మే తరహాలో ఇది కూడా భావోద్వేగాలతో రూపొందిన ప్రేమ కథే. కాకపోతే విజువల్స్ కూల్ గా ఉన్నాయి. ముఖ్యంగా సాయిపల్లవి లుక్స్ ఆకట్టుకునేలా డిజైన్ చేశారు.
ఇదంతా ఓకే కానీ నాలుగు వేల కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్న రామాయణలో సీతగా నటిస్తున్న సాయిపల్లవికి ఇప్పుడీ ఏక్ దిన్ బ్రేక్ ఇస్తుందో లేదోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే కథల విషయంలో చాలా పర్టికులర్ గా ఉండే ఫిదా భానుమతికి అంతగా ఈ సబ్జెక్టులో ఏం నచ్చిందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
స్టోరీ రివీల్ చేయకపోయినా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చూస్తుంటే కరణ్ జోహార్ తరహా లవ్ స్టోరీగానే కనిపిస్తోంది. దీనికి అమీర్ ఖానే నిర్మాత. సునీల్ పాండే దర్శకత్వం వహించారు. ఢిల్లీ బెల్లి, లాల్ సింగ్ చద్దా, రంగ్ దే బసంతి, తారే జమీన్ పర్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
సాయిపల్లవి ఈ మధ్య దక్షిణాది మీద ఎక్కువ దృష్టి పెట్టడం లేదు. రామాయణ ఒప్పుకున్న తర్వాత ఇక్కడ కనిపించడం కూడా మానేసింది. శివ కార్తికేయన్ అమరన్, నాగ చైతన్య తండేల్ రెండు సూపర్ హిట్టయినా ఆఫర్లు ఒప్పుకోవడం లేదు. పూర్తిగా రామాయణకే అంకితమైపోయింది.
ఏక్ దిన్ సక్సెస్ అయినా కాకపోయినా దీపావళికి వచ్చే రామాయణ మాత్రం ఆమెను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లడం ఖాయం. రన్బీర్ కపూర్, యష్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ దక్కనున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో సీతగా గుర్తింపు వస్తుంది. 2026లో మొత్తం రెండు హిందీ సినిమాలు మాత్రమే ఫ్యాన్స్ ని అలరించబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates