టాలీవుడ్ గత కొన్నేళ్లలో చూడని పెద్ద స్థాయిలో సంక్రాంతిని సెలెబ్రేట్ చేసుకుంటోంది. రాజా సాబ్ వైఫల్యం కాసేపు పక్కనేపడితే మిగిలిన నాలుగు సినిమాల్లో దేనికీ నెగటివ్ టాక్ రాకపోవడం బయ్యర్ల మొహాల్లో వెలుగులు తీసుకొచ్చింది.
మన శంకరవరప్రసాద్ గారు రికార్డులు బద్దలయ్యే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతూ ఉండగా, నారి నారి నడుమ మురారి, అనగనగా ఒక రాజుకు ఆడియన్స్ మద్దతు బాగా దొరికింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి పైవాటితో పోలిస్తే కంటెంట్, స్క్రీన్ షేరింగ్ విషయంలో వెనుకబడిపోవడంతో ర్యాంక్ విషయంలో పోరాడుతోంది. అయినా రవితేజ గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటరనే చెప్పాలి.
ఇంత ఆనందకరమైన వాతావరణంలో ఆందోళన ఎందుకు వస్తుందనే ప్రశ్నకు వద్దాం. ఇలా అన్ని సినిమాలు ఒకేసారి మెప్పించడం వల్ల ఏపీ తెలంగాణతో పాటు యుఎస్ లోనూ థియేటర్ల సమస్య తలెత్తింది. స్క్రీన్లను సర్దుబాటు చేయలేక, టికెట్లు దొరక్క వెనక్కు వెళ్తున్న వందలాది ఆడియన్స్ ని చూస్తూ బాధ పడలేక ఎగ్జిబిటర్లు పడుతున్న యాతన అంతా ఇంతా కాదు.
దీని వల్ల అన్ని సినిమాల ఫుల్ పొటెన్షియల్ వాడుకోలేకపోతున్నామని డిస్ట్రిబ్యూటర్లు వాపోతున్నారు. ముఖ్యంగా తక్కువ థియేటర్లు ఉండే చాలా బిసి సెంటర్లలో ఓవర్ క్రౌడ్ వల్ల ఏం చేయాలో అర్థం కానీ తీవ్రమైన పరిస్థితి నెలకొని ఉంది.
ఒకవేళ ఒకటో రెండో ఫ్లాప్ అయ్యుంటే సిచువేషన్ వేరేలా ఉండేది. ఇలాంటి వాటి స్క్రీన్లు వేరేవాటికి ఇచ్చినా ఎవరూ ఫీల్ కారు. కానీ రాజా సాబ్ మీద భారీ పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో దానికిచ్చిన థియేటర్లను ఉన్నట్టుండి తీసేసి పరిస్థితి లేదు. ప్రభాస్ ఇమేజ్ వల్ల సెలవు రోజుల ఆక్యుపెన్సీలు బాగానే నమోదవుతున్నాయి.
భవిష్యత్తులో సంక్రాంతి క్లాష్ కోరుకున్నప్పుడు ముఖ్యంగా మిడ్ రేంజ్ సినిమాలు ప్రాక్టికల్ గా ఆలోచించడం చాలా అవసరం. ఒకవేళ నారి నారి నడుమ మురారి కనక వేరే టైంలో సోలోగా వచ్చి ఉంటే ఇంకా పెద్ద హిట్టయ్యేదన్న కామెంట్ ని ఎవరూ కాదనలేరు. వచ్చే ఏడాది ఎలా ఉంటుందో చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates