రాజకీయ రంగప్రవేశానికి ముందు చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి మోక్షం ఎప్పుడో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా సుప్రీమ్ కోర్టులో నిర్మాతకు చుక్కెదురయ్యింది. ఇప్పుడీ కేసులో జోక్యం చేసుకోలేమని, ఏదున్నా మదరాసు హైకోర్టు డివిజన్ బెంచ్ లోనే తేల్చుకోవాలని చెప్పడంతో కథ మళ్ళీ మొదటికే వచ్చింది.
సెన్సార్ బోర్డు మాత్రం A సర్టిఫికెట్ తప్ప వేరేది ఇచ్చే ఉద్దేశం లేదనే తరహాలో మొండిగా వ్యవహరించడంతో ఇది ఎక్కడిదాకా వెళ్తుందో అంతు చిక్కడం లేదు. పొలిటికల్ ఇష్యూస్ వల్ల కోలీవుడ్ స్టార్లు ఆచితూచి స్పందిస్తున్నారు.
ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ నుంచి వారం రోజులు గడిచిపోయాయి. బంగారం లాంటి పొంగల్ సీజన్ వృథా అయిపోయిందని బయ్యర్లు వాపోతున్నారు. కార్తీ, జీవా లాంటి ఇతర హీరోలు సినిమాలు వచ్చాయి కానీ థియేటర్ల దగ్గర ప్రతి సంవత్సరం చూసే భారీ తాకిడి లేదు.
నిజానికి మదరాసు కోర్టు సానుకూలంగానే ఉందట. సెన్సార్ నిబంధనలు పాటించి సర్టిఫికెట్ తీసుకోమనే తరహాలో సంకేతాలు ఇస్తోందట. కానీ కట్స్ లేకుండా U/A కోసం ప్రొడ్యూసర్ పోరాడుతున్నారు. ఎందుకంటే పెద్దలకు మాత్రమే ముద్ర పడితే విజయ్ కు ఫాలోయింగ్ ఉన్న చిన్న పిల్లలు, టీనేజర్లు మల్టీప్లెక్సులకు దూరమవుతారు.
జనవరి 20 ఇప్పుడీ వివాదం ముగింపుకు వస్తుందా లేదానేది అంతు చిక్కడం లేదు. కనీసం రిపబ్లిక్ డేకి రిలీజ్ చేస్తే భారీ వసూళ్లు వస్తాయని ఫ్యాన్స్ ఆశ పడుతున్నారు. లేదంటే ఫిబ్రవరికి వెళ్లాల్సి ఉంటుంది.
భగవంత్ కేసరి మెయిన్ పాయింట్ తీసుకుని దానికి చాలా రాజకీయ అంశాలు జోడించిన దర్శకుడు హెచ్ వినోత్ అసలు సినిమాలో ఎలాంటి వివాదాలు పొందుపరిచారనే దాని మీద ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. జన నాయకుడు బృందం ఇప్పుడు సెన్సార్ చేయమన్నదల్లా చేస్తే తప్ప పరిష్కారం దొరికేలా లేదు. వచ్చే ఇరవై తేదీన కూడా ఏదైనా వాయిదా పడితే స్టోరీ మళ్ళీ మొదటికే వస్తుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates