మాములుగా కొత్త సినిమాల విడుదల రోజు తెల్లవారుఝాము లేదా అర్ధరాత్రి షోలు వేయడం సహజం. కానీ నాలుగో రోజు మిడ్ నైట్ స్క్రీనింగ్ ఊహలకు అందని పరిణామం. మన శంకరవరప్రసాద్ గారు డిమాండ్ ని తట్టుకోవడానికి బయ్యర్లకు ఇంతకన్నా మార్గం లేకపోయింది.
రాజమండ్రితో పాటు మరికొన్ని సెంటర్లలో రాత్రి 1 గంటకు షోలు వేయడమే కాదు వాటిని బుక్ మై షోలో పెడితే ఫాస్ట్ ఫిల్లింగ్ కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వివిధ సెంటర్ల నుంచి వస్తున్న ఒత్తిడితో నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ అప్పటికప్పుడు షోలు పెంచే ఏర్పాట్లు చేస్తోంది. అయితే అవి ఆశించిన నెంబర్ లో లేవని ఫ్యాన్స్ చెబుతున్నారు.
ఇదంతా కాంపిటీషన్ వల్ల వచ్చిన సమస్య. ఏకంగా అయిదు స్ట్రెయిట్ సినిమాలు బరిలో ఉండటం వల్ల బిసి సెంటర్స్ లో థియేటర్ పంపకాలు ఇబ్బందిగా మారాయి. రాజా సాబ్ రిజల్ట్ తేడాగా వచ్చినా ప్రభాస్ ఇమేజ్ వల్ల ఆక్యుపెన్సీలు నమోదవుతున్న నేపథ్యంలో అమాంతం దాన్ని తీసేయడానికి లేదు.
మిగిలినవి కూడా డీసెంట్ నుంచి హిట్ టాక్ మధ్యలో ఉండటంతో ఎగ్జిబిటర్లకు ఏం చేయాలో అంతు చిక్కడం లేదు. ఎంత సంక్రాంతి అయినా ఇంత మూకుమ్మడిగా రావడం పట్ల డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. ఒకరో ఇద్దరో తప్పుకుని ఉంటే అందరూ లాభపడే వాళ్ళని అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆగడం నాకు తెలియదన్నట్టు దూసుకుపోతున్న మన శంకరవరప్రసాద్ పరిస్థితి ఆదివారం దాకా ఇలాగే ఉండబోతోంది. స్కూల్ సెలవులు అప్పటిదాకా ఉంటాయి కాబట్టి ఫ్యామిలీస్ థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. టికెట్ రేట్ల పెంపు ఉన్నా సరే హౌస్ ఫుల్ బోర్డులకు అవి అడ్డంకి కావడం లేదు.
భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని వచ్చిన చిరంజీవి ఈ స్థాయిలో విధ్వంసం చేస్తాడని ఎవరూ ఊహించలేదు. కుటుంబ ప్రేక్షకుల్లో మెగాస్టార్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మీద ఏ స్థాయిలో నమ్మకముందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే నాలుగు వారాల లాంగ్ రన్ ఖాయమనిపించేలా ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates