గత కొన్ని రోజులుగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న అల్లు అర్జున్ – దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ ఎట్టకేలకు అఫీషియల్ అయ్యింది. ఈ మేరకు చిన్న యానిమేషన్ వీడియో రూపంలో అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. ఉదయం నుంచి ఐకాన్ స్టార్ అభిమానులను తెగ ఊరిస్తూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఎట్టకేలకు వాళ్ళు కోరుకున్న శుభవార్త చెప్పేశారు.
గత ఏడాది కూలి ఆశించిన ఫలితం ఇవ్వకపోయిన తర్వాత లోకేష్ ఎవరితో చేతులు కలుపుతాడనే దాని మీద రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ అనూహ్యంగా బన్నీ పేరు తెరమీదకు రావడంతో అంచనాలు, క్యాలికులేషన్లు మారిపోయాయి.
ఇక వీడియో విషయానికి వస్తే అందులో విజువల్స్ గమనిస్తే ఇదేదో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే మూవీగా కనిపిస్తోంది. అడవులు, జంతువులు, ఎత్తయిన కొండ మీద గుర్రం ఎక్కి బన్నీ దాన్ని అదిలించడం లాంటివి నేపథ్యం ఏంటో చెప్పకనే చెబుతున్నాయి.
జాగ్రత్తగా డీ కోడ్ చేస్తే లోకేష్ ఈసారి నగరాన్ని వదిలి ఖైదీ తరహాలో ఒక డార్క్ వరల్డ్ లోకి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ప్యాన్ ఇండియా మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చబోతున్నాడు. స్ట్రైవ్ ఫర్ గ్రేట్ నెస్ అని క్యాప్షన్ పెట్టడం చూస్తే మనుగడ, ఆధిపత్యం కోసం పోరాటమనే మెసేజ్ అంతర్లీనంగా కనిపిస్తోంది.
చెప్పడమైతే 2026 స్టార్ట్ అన్నారు కానీ అది నిజంగా జరుగుతుందా లేదానేది ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న అట్లీ ప్రాజెక్టు మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్న టైం అక్టోబర్ లో గుమ్మడికాయ కొట్టేస్తే వెంటనే లోకేష్ కనగరాజ్ సెట్స్ లో బన్నీ అడుగు పెడతాడు.
వరసగా ఇద్దరు తమిళ దర్శకులతో పని చేయడం బన్నీ కెరీర్ లో ఇదే మొదటిసారి. ఎంత లేదన్నా ఏడాదికి పైగానే టైం పడుతుంది కాబట్టి 2028 రిలీజ్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. పుష్ప నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్న బన్నీ రాజీ పడకుండా ప్లానింగ్ చేసుకుంటున్నాడు. ఈ లెక్కన పుష్ప 3 ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates