కొత్త ట్రెండ్… ప్రిమియర్ షోల్లో ఫ్యామిలీ ఆడియన్స్

స్టార్ హీరోల సినిమాలకు బెనిఫిట్ షోలు, ప్రిమియర్ షోలు వేస్తే.. అక్కడంతా దాదాపుగా మొత్తం కుర్రాళ్ల సందడే ఉంటుంది. ఈ మధ్య అమ్మాయిలు కూడా వస్తున్నారు కానీ.. ఒకప్పుడైతే మొత్తంగా మగాళ్లతోనే ఆ షోలు నిండిపోయేవి. వేళ కాని వేళ.. డై హార్డ్ ఫ్యాన్స్ చేసే హంగామాను తట్టుకోవడం అంత తేలిక కాదు. అందుకే వీటి జోలికి ఫ్యామిలీ ఆడియన్స్ అస్సలు వెళ్లరు.

అందులోనూ ప్రిమియర్ షోలకు టికెట్ల ధరలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్‌ వాటికి దూరంగా ఉంటారు. కానీ ఆదివారం రాత్రి మాత్రం ఎన్నడూ లేని అరుదైన దృశ్యాలు కనిపించాయి. మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున పెయిడ్ ప్రిమియర్స్ వేయగా.. ఎక్కడ చూసినా ఫ్యామిలీ ఆడియన్స్ సందడి కనిపించింది.

హైదరాబాద్‌లో చాలా థియేటర్లను కుటుంబ ప్రేక్షకులే నింపేశారు. యువ ప్రేక్షకులు సగం మంది ఉంటే.. మిగతా సగం వృద్ధులు, నడి వయస్కులు.. మహిళలు.. పిల్లలు ఉన్నారు పలు థియేటర్లలో. ఇందులో సగం క్రెడిట్ మెగాస్టార్ చిరంజీవిదైతే, ఇంకో సగం ఘనత దర్శకుడు అనిల్ రావిపూడిది. అనిల్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఏ స్థాయిలో కనెక్ట్ అవుతారో గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’కు వచ్చిన స్పందనే రుజువు. 

మరోసారి అనిల్ మీద నమ్మకంతో కుటుంబ ప్రేక్షకులు.. ప్రిమియర్స్‌కే పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేశారు. ఎప్పుడూ ప్రిమియర్స్‌లో యూత్ సందడే చూసే రెగ్యులర్ సినీ గోయర్స్.. ఇంత పెద్ద సంఖ్యలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను చూసి షాకైపోయారు.

టార్గెటెడ్ ఆడియన్స్‌కు కావాల్సిన వినోదాన్ని అనిల్ ఇచ్చేయడంతో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. కుటుంబ ప్రేక్షకులు ప్రిమియర్స్‌కు వచ్చి థియేటర్లలో సందడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.