పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే మంచి ఊపు చూపించిన ఈ చిత్రానికి.. పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక తొలి రోజు షోలు గడిచేకొద్దీ టాక్ మరంత పాజిటివ్‌గా మారి.. హౌస్ ఫుల్ షోలతో రన్ అయింది. రెండో రోజు కూడా సినిమాకు మంచి ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి.

సినిమా పెద్ద రేంజికి వెళ్లబోతోందన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం.. మంగళవారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీలో చిరంజీవి, నయనతారలకు ఇద్దరు పిల్లలున్నట్లు చూపిస్తారు. అందులో అమ్మాయి పెద్దది కాగా, అబ్బాయి చిన్నవాడు. ఐతే ఇందులో అబ్బాయిగా విక్కీ అనే పాత్ర చేసింది అబ్బాయి కాదట. అమ్మాయట. సక్సెస్ మీట్లో ఈ సంగతి వెల్లడైంది.

విక్కీ పాత్రను చేసిన అమ్మాయి పేరు ఊహ అట. యాంకర్ మంజూష ఆ అమ్మాయి స్టేజ్ మీదికి వచ్చినపుడు సినిమలో ఏ పాత్ర చేశావు అని అడిగితే.. విక్కీ అని చెప్పేసరికి షాకైందట. తర్వాత మొత్తం ఆడిటోరియానికి ఈ అమ్మాయిని యాంకర్ పరిచయం చేసింది. అబ్బాయిగా కనిపించడం కోసం పొడవాటి జుట్టును కూడా కత్తిరించుకుని నటించిందంటూ ఆ అమ్మాయి డెడికేషన్ గురించి అనిల్ చెప్పేసరికి.. ఊహ ఎమోషనల్ అయి స్టేజ్ మీద ఏడ్చేసింది.

తర్వాత ఆ అమ్మాయి అనిల్‌ను డైరెక్టర్ మామ, మెగాస్టార్‌ను చిరంజీవి మామ అని సంబోధిస్తూ చాలా కాన్ఫిడెంట్‌గా మాట్లాడింది. మరోవైపు అనిల్ మాట్లాడుతూ.. చిరంజీవి కెరీర్లో మైల్‌స్టోన్ మూవీ అయిన ‘పసివాడి ప్రాణం’లో పిల్లాడిగా కీలక పాత్రలో నటించింది ఒక అమ్మాయి అని.. మళ్లీ ఈ సినిమాకు అలా జరిగిందని.. ఇదొక ఆశ్చర్యకరమైన కోయిన్సిడెన్స్ అని.. కానీ అది తాను కావాలని చేయలేదని.. ఈ మధ్యే ఆ విషయం గుర్తించానని చెప్పాడు.