ప్ర‌భాస్‌తో మోహ‌ల్ లాల్ జ‌ట్టు క‌డితే..?


మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌తో క‌లిసి ప‌ని చేయ‌డానికి వేరే భాష‌ల స్టార్లు అమితాస‌క్తి చూపిస్తారు. త‌మిళ‌, తెలుగు, హిందీ భాష‌ల్లో ఆయ‌న చేసిన సినిమాలు ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక ఆస‌క్తిని రేకెత్తించాయి. త‌మిళంలో విజ‌య్‌తో క‌లిసి ఆయ‌న చేసిన జిల్లా బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది. తెలుగులో ఎన్టీఆర్‌తో చేసిన జ‌న‌తా గ్యారేజ్ కూడా బ్లాక్‌బ‌స్ట‌రే. హిందీలోనూ కంపెనీ లాంటి సినిమాల‌తో త‌న ప్ర‌త్యేక‌త చాటుకున్నారాయ‌న‌.

లాల్ ఉంటే ఆయ‌న పాత్ర సినిమాలో ఎంత హైలైట్ అవుతుందో తెలిసిందే. ఏదైనా ప్ర‌త్యేక పాత్ర చేశారంటే ఆ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రో స్థాయికి తీసుకెళ్తారాయ‌న‌. అలాంటి న‌టుడు బాహుబ‌లితో తిరుగులేని స్థాయిని అందుకుని, పాన్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా మారిన ప్ర‌భాస్‌తో క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే అద్భుతంగా అనిపిస్తోంది క‌దా.

ఈ క‌ల‌యిక‌ను నిజం చేయ‌డానికి కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్ హీరోగా ఇటీవ‌లే ప్ర‌శాంత్ ద‌ర్శ‌క‌త్వంలో స‌లార్ అనే చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేజీఎఫ్ నిర్మాత‌లే ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. త్వ‌ర‌లోనే రాధేశ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసి స‌లార్‌ను మొద‌లుపెట్టాల‌ని చూస్తున్నాడు ప్ర‌భాస్. ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌కు మోహ‌న్‌లాల్‌ను తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌.

స‌లార్ అంటే రాజుకు కుడిభుజంగా ఉండే వ్య‌క్తి అంటూ ప్ర‌శాంత్ ఇచ్చిన వివ‌ర‌ణ‌ను బ‌ట్టి రాజు పాత్ర‌ను లాల్ ఏమైనా చేస్తాడేమో అనిపిస్తోంది. ఆయ‌‌న‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నార‌ట‌. రూ.20 కోట్ల దాకా పారితోష‌కం కూడా ఆఫ‌ర్ చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. నిజంగా ప్ర‌భాస్, లాల్ కాంబినేష‌న్ ఓకే అయితే మాత్రం ఈ సినిమా వేరే లెవెల్‌కు వెళ్లిపోతుంద‌న‌డంలో సందేహం లేదు. ద‌క్షిణాదిన అంత‌టా ఈ చిత్రానికి తిరుగులేని క్రేజ్ వ‌స్తుంది. మ‌రి ఈ క‌ల‌ల కాంబినేష‌న్ నిజ‌మ‌వుతుందేమో చూడాలి.