టాక్సిక్ టాపిక్…. మహిళా కమిషన్ సీరియస్

ఇటీవలే విడుదలైన యష్ టాక్సిక్ టీజర్ పట్ల జెన్ జీ రెస్పాన్స్ బాగానే ఉన్నా సగటు ప్రేక్షకులు మాత్రం అంత బోల్డ్ సీన్ ని అంగీకరించలేకపోతున్నారు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దీని మీద వచ్చిన విమర్శలకు నవ్వుతూ సమాధానం దాటవేశారు కానీ తప్పని ఒప్పని చెప్పలేదు.

యష్ బయట కనిపించే సందర్భం దొరక్కపోవడంతో మీడియా అడిగే ఛాన్స్ లేకపోయింది. తాజాగా కర్ణాటక మహిళా కమీషన్ టాక్సిక్ టీజర్ పట్ల సీరియస్ అయ్యింది. ఎరోటిక్ సన్నివేశాన్ని చాలా అతిగా చూపించారంటూ సెన్సార్ బోర్డుకు లేఖ రాయడంతో పాటు, నిర్మాత సంస్థ కెవిఎన్ కు దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించాల్సిందిగా లేఖ రాసింది.

దీని తాలూకు పరిణామాలు ఎలా ఉంటాయో కానీ ఒకటి మాత్రం ఒప్పుకోవాలి. కేవలం ఇంగ్లీష్ వెబ్ సిరీస్ లకు మాత్రమే పరిమితమయిన ఓవర్ బోల్డ్ కంటెంట్ ని యష్ లాంటి స్టార్ హీరోలు కేవలం హీరోయిజం, రియలిస్టిక్ అనే కారణం చెప్పి చూపించడం కరెక్ట్ కాదు.

ఎందుకంటే యూట్యూబ్ అంటే ఓపెన్ ప్లాట్ ఫార్మ్. కెజిఎఫ్ ని విపరీతంగా ఇష్టపడిన పిల్లలు ఇప్పుడు టాక్సిక్ లో ఏదో ఉందని ఖచ్చితంగా టీజర్ చూస్తారు. అప్పుడు వాళ్ళ మనసులో తలెత్తే భావాలు ఎలా ఉంటాయో ఎవరూ ఊహించలేరు. సినిమాల్లో ఎవరూ మంచి నేర్చుకోరేమో కానీ చెడుని ఫాలో కావడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది.

దీనికి సంబంధించి టీమ్ ఇంకా స్పందించాల్సి ఉంది. కేవలం మూడు నిముషాలే ఇంత కాంట్రవర్సీ చేస్తే ఇక ఫుల్ మూవీ ఏ స్థాయిలో ఉంటుందోనని అంచనాలు రేగుతున్నాయి. ఒకపక్క కాంతార లాంటి రూటెడ్ డ్రామాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతుంటే ఇప్పుడీ టాక్సిక్ లాంటివి అనవసర చర్చకు దారి తీస్తున్నాయని శాండల్ వుడ్ లవర్స్ వాపోతున్నారు.

గతంలో తాను కేవలం కుటుంబం మొత్తం చూసే సినిమాల్లో మాత్రమే నటిస్తానని ఒక పాత ఇంటర్వ్యూలో చెప్పిన యష్ క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో బాగా తిరిగింది. మార్చి 19 విడుదల కాబోతున్న టాక్సిక్ ఈలోగా ఇంకేం వివాదాలు వస్తాయో.