సంక్రాంతి రేసులో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ది రాజా సాబ్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాస్త కన్ఫ్యూజన్ తోనే కొనసాగుతోంది. అంచనాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ సేఫ్ జోన్ లోకి రావాలంటే దాదాపు 210 కోట్లకు పైనే షేర్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఇక అంచనాల ప్రకారం దాదాపు 50% వరకే రికవరీ అయినట్లు తెలుస్తోంది. ఇక మిగతా భాషల్లో వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవు. నిర్మాత లాభాల్లోకి రావాలంటే ఈ సంక్రాంతి సెలవులను సినిమా పక్కాగా వాడుకోవాలి.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పరిస్థితులు రాజా సాబ్ కు కొంత సవాలుగా మారుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి టాక్ రావడంతో, ఆ ప్రభావం ప్రభాస్ సినిమా వసూళ్లపై పడే అవకాశం ఉంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యామిలీలను ఆకట్టుకుంటుండటంతో, ఇప్పుడు రాజా సాబ్ తన పట్టును నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది.
ఇక పోటీ ఇక్కడితో ఆగడం లేదు. రేపు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ఎల్లుండి నవీన్ అనగనగా ఒక రాజు శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు కూడా థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న కామెడీ ఎంటర్టైనర్లే. ఇలాంటి పరిస్థితుల్లో ఇతర సినిమాల హడావుడిని తట్టుకుని రాజా సాబ్ బాక్సాఫీస్ వద్ద నిలకడగా కలెక్షన్లు రాబట్టడం పెద్ద టాస్క్ గా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో రాజా సాబ్ కు మరింత బూస్ట్ రావాలంటే ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని ట్రేడ్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తోంది. మిగతా భాషల్లో ఇప్పటికే వసూళ్లు తగ్గుముఖం పట్టడంతో, ఏదో ఒక కొత్త తరహా ప్రమోషన్ స్టంట్ తో మళ్ళీ సినిమాను హైలైట్ చేయాల్సి ఉంటుంది. ప్రభాస్ ఇచ్చే ఒక్క ఇంటర్వ్యూ లేదా ఒక చిన్న ప్రమోషన్ వీడియో అయినా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద పెద్ద మార్పును తీసుకురాగలదు.
నిర్మాత పెట్టిన పెట్టుబడికి లాభం దక్కాలంటే ఈ పండుగ సీజన్ ముగిసే లోపు మరింత ఎక్కువ టిక్కెట్లు తెగాలి. సంక్రాంతి సెలవుల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను మళ్ళీ థియేటర్లకు రప్పించగలిగితేనే ఈ భారీ లక్ష్యం సాధ్యమవుతుంది. మరి మిగతా సినిమాల పోటీని తట్టుకుని రాజా సాబ్ బాక్సాఫీస్ దగ్గర ఎలా నిలబడుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates