సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ ‘రాజా సాబ్’, మెగాస్టార్ ‘MSG’ వంటి భారీ చిత్రాల మధ్య ఒక యంగ్ హీరో సినిమా వస్తోందంటే ఆ ధైర్యం వెనుక ఏదో ఒక బలమైన కారణం ఉండాలి.
శర్వానంద్ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ జనవరి 14న విడుదల కాబోతోంది. కామెడీ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ఈ హీరో, ఈసారి తన మార్కెట్‌ను కాపాడుకోవడమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ఒక ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
సాధారణంగా పెద్ద సినిమాల హవా ఉన్నప్పుడు మిగతా సినిమాలకి థియేటర్లు దొరకడం ఒక ఎత్తు అయితే, ప్రేక్షకులను థియేటర్ కి రప్పించడం మరో ఎత్తు. పండగ టైమ్ లో మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు హై లెవెల్లో ఉంటాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నలుగురు కలిసి సినిమా చూడాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే. ఈ ఆర్థిక అంశమే ఇప్పుడు చిన్న సినిమాలకి పెద్ద శత్రువుగా మారుతోంది. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన శర్వానంద్ టీమ్ ఒక ఇంట్రెస్టింగ్ ప్లాన్ వేసింది.
లేటెస్ట్ గా శర్వానంద్ క్లారిటీ ఇస్తూ.. తమ సినిమా టికెట్లను ఎలాంటి పెంపు లేకుండా కేవలం ఎంఆర్‌పీ ధరలకే అందుబాటులో ఉంచుతున్నామని ప్రకటించాడు. ఈ నిర్ణయం ప్రస్తుత పోటీ వాతావరణంలో ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పవచ్చు. పండగ పూట కాస్త తక్కువ ఖర్చుతో సరదాగా సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్‌కి మురారి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అవ్వచ్చు.
శర్వానంద్‌కు సంక్రాంతి సీజన్ లో మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. భారీ అంచనాలతో కాకుండా, ఒక మంచి కథతో వచ్చినప్పుడు ప్రేక్షకులు ఆయనను ఎప్పుడూ ఆదరించారు. ‘నారీ నారీ నడుమ మురారి’ ట్రైలర్‌లో కనిపించిన హిలేరియస్ కామెడీ, సంయుక్తా మీనన్ సాక్షి వైద్యల గ్లామర్ యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి.
వీటన్నిటికీ తోడు నవీన్ అనగనగా ఒక రాజు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా చిన్నపాటి ధర పెంపుతో బరిలోకి దిగుతుండడంతో శర్వా సినిమా టికెట్ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండటం అనేది సినిమా ఓపెనింగ్స్ మీద పాజిటివ్ ప్రభావం చూపే అవకాశం ఉంది.
కంటెంట్ బాగుండి, టికెట్ రేట్లు తక్కువగా ఉంటే సినిమాకు వచ్చే మౌత్ టాక్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది. శర్వానంద్ తీసుకున్న ఈ ఎంఆర్‌పీ నిర్ణయం వల్ల థియేటర్లలో ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశం మెండుగా ఉంది. భారీ యాక్షన్ సినిమాల మధ్య ఒక చక్కిలిగింతలు పెట్టే కామెడీ సినిమాను తక్కువ ధరకే చూడవచ్చంటే ఎవరైనా మొగ్గు చూపుతారు. సంక్రాంతి విన్నర్ రేసులో మురారి తనవంతు ప్రయత్నం గట్టిగానే చేస్తున్నాడు. మరి ఈ టికెట్ రేట్ల మ్యాజిక్ బాక్సాఫీస్ అంకెలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates