బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు ప్రభాస్‌ను తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు కానీ.. రాజమౌళితో సినిమాలు చేసిన వేరే హీరోలకు ఈ స్థాయి ఫాలోయింగ్, మార్కెట్ రాని సంగతి గుర్తించాలి. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు సరైన ఫాలోఅప్ సినిమాలు పడకపోయినా.. తన ఫాలోయింగ్ చెక్కుచెదరలేదు.
సాహో, ఆదిపురుష్ చిత్రాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సలార్, కల్కి చిత్రాలకు హిందీలో కలెక్షన్లకు ఢోకా లేకపోయింది. రాధేశ్యామ్ సినిమా మాత్రమే పూర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఓవరాల్‌గా డిజాస్టర్ అయింది. మళ్లీ ఇప్పుడు రాజాసాబ్ సినిమా హిందీ మార్కెట్లో పెద్దగా ప్రభావం చూపని సంకేతాలు కనిపిస్తున్నాయి. రాధేశ్యామ్‌కు వచ్చిన స్థాయిలో కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ రాకపోవడం గమనార్హం.
కారణాలేంటో కానీ.. హిందీ మార్కెట్లో రాజాసాబ్ సినిమాను సరిగా ప్రమోట్ చేయనే లేదు టీం. ముఖ్యంగా ప్రభాస్ ఒక ప్రమోషనల్ ఈవెంట్లోనూ పాల్గొనలేదు. టీం మొక్కుబడిగా ఒక ప్రెస్ మీట్ పెట్టింది. కనీసం దానికి విలన్ పాత్ర పోషించిన సంజయ్ దత్‌ను కూడా రప్పించలేకపోయింది.
రాజాసాబ్ ప్రోమోలు కూడా హిందీ ప్రేక్షకులను ఆకర్షించలేకపోయాయి. ఆ ప్రభావం ఓపెనింగ్స్ మీద గట్టిగానే పడింది. బాహుబలి తర్వాత అతి తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకున్న ప్రభాస్ సినిమా ఇదే కావడం గమనార్హం. తొలి రోజు హిందీ వసూళ్లు రూ.6 కోట్లకు అటు ఇటుగా వచ్చాయి. వీకెండ్ వసూళ్లు 16-17 కోట్ల మధ్య ఉంటాయని అంచనా వేస్తున్నారు.
సినిమాకు పాజిటివ్ టాక్ లేకపోవడం, తొలి రోజు తర్వాత కలెక్షన్లు పుంజుకోకపోవడంతో హిందీ ఆడియన్స్ ఈ సినిమాతో కనెక్ట్ కాలేకపోయారని స్పష్టమవుతోంది. అసలు పెద్దగా జనం థియేటర్లకే రాలేదు. ఓవరాల్ వసూళ్లు రూ.20-25 కోట్ల మధ్య ఉండొచ్చు. ప్రభాస్ స్థాయికి ఇది చిన్న నంబరే. సాహో లాంటి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సినిమాతో రూ.150 కోట్లు వసూలు చేసిన రేంజ్ అతడిది. దీన్ని బట్టి రాజాసాబ్ హిందీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటోందో అర్థం చేసుకోవచ్చు.
Gulte Telugu Telugu Political and Movie News Updates