మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం? ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. ప్రభాస్ ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేసిన ఈ మూవీ.. సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ప్రతికూల స్పందనే తెచ్చుకుంది. సినిమా కాన్సెప్ట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్ బాలేదన్నది మెజారిటీ ప్రేక్షకుల మాట. చాలా వరకు అవసరం లేని, బోరింగ్ సన్నివేశాలతో నింపేయడం సినిమాకు మైనస్ అయింది.
చివరి 40 నిమిషాల సినిమా బాగున్నా.. అప్పటి వరకు సినిమాను భరించడమే ప్రేక్షకులకు కష్టమవుతోంది. అద్భుతమైన సన్నివేశాలున్నట్లుగా నిడివిని ఏకంగా 3 గంటలు దాటించేశారు. తీరా చూస్తే సగానికి సగం సీన్లు ప్రేక్షకులకు బోర్ కొట్టించేశాయి. ఆ సీన్లన్నింటినీ అలాగే ఉంచి.. ప్రభాస్ ఓల్డ్ కింగ్ గెటప్‌లో ఉన్న ఎపిసోడ్ మొత్తం లేపేసింది చిత్ర బృందం. ఇందుకు సాంకేతిక కారణాలేవో చెప్పారు కానీ.. సినిమాలో ఆ సీన్లు లేకపోవడం మాత్రం ప్రభాస్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.
ఐతే ప్రిమియర్స్ నుంచే ఈ ఎపిసోడ్ మిస్ కావడంపై తీవ్ర విమర్శలు రావడంతో టీం అప్రమత్తమైంది. చకచకా ఆ ఎపిసోడ్‌ను రెడీ చేసి, ఆదివారం ఈవెనింగ్ షోలను నుంచి సినిమాలో కలిపారు. దీని కోసం ద్వితీయార్ధంలో బొమన్ ఇరానీ మీద తీసిన కొన్ని సన్నివేశాలను లేపేశారు. తద్వారా నిడివి అంతకుముందు ఉన్నట్లే ఉంది. ఇక సాయంత్రం సినిమా చూసిన వాళ్లందరూ సినిమాలో యాడ్ చేసిన ఎపిసోడ్ గురించి పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. సినిమా మొత్తానికి ఈ ఎపిసోడ్, అందులో వచ్చే ఫైట్ హైలైట్ అని అంటున్నారు.
ఇది కచ్చితంగా సినిమాలో ఉండాల్సిన ఎపిసోడ్ అని.. అసలు దీన్ని ఎలా పక్కన పెట్టారన్నది అర్థం కాని విషయమని అంటున్నారు. సినిమాను పలుమార్లు వాయిదా వేసి, చాలా టైం తీసుకుని సంక్రాంతి బరిలోకి వచ్చిన టీం.. ఇంత కీలకమైన ఎపిసోడ్‌ను సినిమాలో యాడ్ చేయలేకపోవడం దారుణమని.. ఇది సినిమాలో అవసరం లేదని అనుకుని ఉన్నా, సీక్వెల్ కోసం అట్టిపెట్టి ఉన్నా.. అది క్షమార్హం కాని తప్పు అంటున్నారు. ఐతే ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిన నేపథ్యంలో ఈ ఎపిసోడ్ వల్ల సినిమాకు ఎంతమేర ప్రయోజనం ఉంటుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates