రాజుగారి ప్రేమకథలో సరదా ఎక్కువే

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈసారి అనగనగా ఒక రాజుతో వస్తున్నాడు. జనవరి 14 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ నిర్మించారు.

జాతి రత్నాలు నుంచి నవీన్ కు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. మాములు కామెడీని కూడా తన టైమింగ్ తో పెద్ద స్థాయికి తీసుకెళ్తాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అయితే ఈసారి సంక్రాంతి పండక్కు చిరంజీవి, ప్రభాస్, రవితేజ, శర్వానంద్ లాంటి సీనియర్లతో పోటీ పడేందుకు రెడీ అవుతున్నాడు. ఇవాళ ట్రైలర్ వచ్చేసింది.

కథేంటో దాచలేదు. అరటిపండు ఒలిచినట్టు చెప్పేశారు. అనగనగా గోదావరి జిల్లాల సైడులో ఒక పెద్ద గ్రామం. డబ్బు డాబు రెండూ ఉన్న కుర్రాడు రాజు (నవీన్ పోలిశెట్టి) ఒకే కూతురు ఉండే  సంబంధం కోసం చూస్తుంటాడు. అప్పుడే మెరుపులా ఒక అమ్మాయి (మీనాక్షి చౌదరి) పరిచయమై ప్రేమలో పడేలా చేస్తుంది.

జాలీగా జీవితాన్ని గడుపుతున్న రాజు జీవితంలో లోకల్ లీడర్ (తారక్ పొన్నప్ప) వల్ల ఒక సమస్య తలెత్తుతుంది. ఏకంగా లవ్ స్టోరీనే రిస్కులో పడుతుంది. ప్రతిదీ నవ్వుతూ పరిష్కరించుకునే రాజు ఈసారి కూడా అదే చేస్తాడు. మరి ఈ క్రమంలో అతనికి ఎదురైన సరదా సవాళ్లు ఏంటో తెలుసుకోవాలంటే జనవరి 14 థియేటర్లలో చూడాలి.

దర్శకుడు మారి ఎంచుకున్నది సింపుల్ స్టోరీనే అయినా నవీన్ పోలిశెట్టి వల్ల సన్నివేశాలకు కామెడీ గ్లామర్ తోడయ్యింది. చిన్న చిన్న మాటలతో నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకున్న వైనం ట్రైలర్ లో బయట పడింది. ఫన్ కంటెంట్ కావడంతో మిక్కీ జె మేయర్ కు రిస్క్ అనిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వాల్సిన అవసరం పడలేదు.

ఆల్రెడీ పాటలు రీచ్ తెచ్చుకున్నాయి. మొత్తానికి అనగనగా ఒక రాజులో నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షోతో పాటు మీనాక్షి గ్లామర్ అదనపు అర్హతగా పబ్లిక్ ని టార్గెట్ చేయబోతోంది. అంచనాలు రేపడంలో టీమ్ సక్సెస్ అయ్యిందని చెప్పాలి. ఇంతే మోతాదులో మొత్తం సినిమా ఉంటే టెన్షన్ అక్కర్లేదు.