‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తో ప్రేక్షకులను మెప్పించి, ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన కొత్త దర్శకుడు స్వరూప్. ఆ సినిమా రిలీజయ్యాక ఏడాదికి పైగా విరామం తీసుకున్న స్వరూప్.. శనివారమే తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ సినిమానే.. మిషన్ ఇంపాజిబుల్.
తొలి సినిమా సూపర్ హిట్టయిన నేపథ్యంలో ఈసారి పేరున్న హీరోతో సినిమా తీస్తాడనుకుంటే.. ముగ్గురు పిల్లల్ని ప్రధాన పాత్రలకు తీసుకుని వెరైటీ సినిమాను అనౌన్స్ చేశాడు. ఇది టాలీవుడ్లో చర్చనీయాంశం అవుతుండగా.. అనుకోని వివాదం చిత్ర బృందానికి ఇబ్బందికరంగా మారింది. పోస్టర్లో ఆంజనేయుడు, శివుడు, కృష్ణుడి అవతారాల్లో తుపాకులు పట్టుకుని ఉండటం కొందరికి నచ్చలేదు. దేవుళ్ల చేతికి తుపాకులివ్వడమేంటి అంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ స్పందించింది.
తమ పోస్టర్ ఎవరినీ కించపరిచే, మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశంతో రూపొందించింది కాదని.. ఈ పోస్టర్ను వెనక్కి తీసుకుంటున్నామని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప్రకటించింది. ఈ పోస్టర్ గురించి సోషల్ మీడియాలో మరీ పెద్ద రగడేమీ జరిగిపోలేదు కానీ.. అభ్యంతరం చెప్పింది ఎంత మంది అన్నది పక్కన పెడితే వివాదానికి ఎందుకు ఆస్కారం ఇవ్వడం అని భావించి పోస్టర్ను వెనక్కి తీసుకున్నట్లున్నారు. ఈ వివాదాన్ని పక్కన పెడితే ఈ పోస్టర్ అయితే జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది.
అంత చిన్న పిల్లలు ఎంచుకున్న మిషన్ ఏంటి.. వాళ్లు ఏం చేస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఏర్పడింది. ఓవైపు ‘ఆచార్య’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఇలా చిన్న పిల్లలతో సినిమా మొదలు పెట్టడం, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ తర్వాత స్వరూప్ ఇలాంటి సినిమా తీయడం ఆసక్తి రేకెత్తించేదే. మరి ఈ సినిమాలో ఏం విశేషం ఉంటుందో చూడాలి.