సినిమా పైరసీల ద్వారా గుర్తింపు పొందిన ఐబొమ్మ రవికి మరిన్ని కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఐదు కేసుల్లో రవి నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. పైరసీతో పాటు మనీలాండరింగ్ వంటి కీలక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను విచారించారు.
అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైదరాబాద్ నాంపల్లి కోర్టులో రవి పిటిషన్లు దాఖలు చేశారు. తనపై నమోదైన ఐదు కేసుల్లోనూ బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఐదు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయడంతో బుధవారం నాంపల్లి కోర్టు వాటిపై విచారణ చేపట్టింది.
పోలీసుల తరఫున న్యాయవాది బలమైన వాదనలు వినిపించారు. రవి కేసులో ఇంకా లోతైన విచారణ కొనసాగుతోందని, ఆయన పైరసీ నెట్‌వర్క్‌పై ఇంకా సమాచారం సేకరించాల్సి ఉందని తెలిపారు. రవికి విస్తృత నెట్‌వర్క్ ఉందని, డబ్బులకు లోటు లేదని పేర్కొన్నారు.
అలాగే రవికి అనేక విదేశీ పాస్‌పోర్టులు ఉన్నాయని, ఇప్పుడే బెయిల్ ఇస్తే ఆయన ఎప్పుడైనా విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం రవికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.
అన్యాయం!
ఇదే సమయంలో రవి తరఫున హాజరైన న్యాయవాది ఇది అన్యాయమని వాదించారు. రవిని ఇప్పటికే అనేకసార్లు విచారించారని, అవసరమైన సమాచారం మొత్తం రాబట్టారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే రవిని అరెస్ట్ చేశారని అన్నారు.
సినిమా పైరసీ అనేది వ్యవస్థీకృత నేరమని, ఇది ఒక్క వ్యక్తికి సంబంధించిన విషయం కాదని చెప్పారు. పైరసీ ద్వారా సినిమాలు చూసిన వారూ నిందితులేనని వాదించారు. అయితే ఈ వాదనలను కోర్టు తోసిపుచ్చింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates