చిరుతో రెహమాన్… మూడోసారి మిస్సవ్వదా?

మూవీ లవర్స్ పాతికేళ్ల క్రితమే కోరుకున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం. కానీ రెండుసార్లు ఆ అవకాశం మిస్ అయ్యింది. 1999లో చిరు మొదటి బాలీవుడ్ మూవీ ‘రిటర్న్ అఫ్ ది థీఫ్ అఫ్ బాగ్దాద్’కు మ్యూజిక్ డైరెక్టర్ గా మొదట ఎంచుకున్నది రెహమాన్నే.

ఆ సంవత్సరం ఆగస్ట్ 22 మెగా పుట్టినరోజు సందర్భంగా జరిగిన ఓపెనింగ్ కి రెహమాన్ హాజరై అట్రాక్షన్ అఫ్ ది ఈవెంట్ గా నిలిచారు. తెలుగు వెర్షన్ బాధ్యతలు సురేష్ కృష్ణ చూసుకునేవారు. కొంత కాలం షూటింగ్ అయ్యాక ఆర్థిక సమస్యల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. రెహమాన్ కంపోజ్ చేసిన ట్యూన్స్ బయటికి రాలేదు.

దశాబ్దాల తర్వాత సైరా నరసింహారెడ్డి కోసం మొదట రెహమాన్ పేరే పరిశీలించి ఆ మేరకు సంప్రదించారు కూడా. కానీ కమిట్ మెంట్స్ ఎక్కువగా ఉన్న కారణంగా ఇంత పెద్ద చిత్రానికి తాను సమయం కేటాయించలేనని చెప్పడంతో మెగా ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇప్పుడు మూడోసారి అలా జరగదని ఫిలిం నగర్ టాక్.

వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిరంజీవి, దర్శకుడు బాబీ కలయికలో కెవిఎన్ ప్రొడక్షన్స్ ఒక భారీ ప్రాజెక్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలుత దీనికి తమనే మ్యూజిక్ అని చెప్పారు. తీరా ఇప్పుడు చూస్తేనేమో ఏఆర్ రెహమాన్ ని రంగంలోకి దించబోతున్నట్టు సమాచారం.

దీనికి కారణం పెద్దినే. చరణ్ సినిమా టీజర్, చికిరి చికిరి పాటకు రెహమాన్ ఇచ్చిన క్వాలిటీకి అందరూ ఫిదా అయిపోయారు. దీంతో బాబీ తీయబోయే గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఆయనే బెస్ట్ ఆప్షన్ అని టీమ్ భావిస్తోందట. ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ దాదాపు కన్ఫర్మ్ అంటున్నారు.

ఇటీవలి కాలంలో తమన్ పనితనం మీద కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి మనసు మార్చుకున్నారా లేక ఫ్రెష్ మ్యూజిక్ కోసం చూస్తున్నారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీపావళిలోగా పూర్తి చేసేలా పక్కా ప్లానింగ్ జరుగుతోందట.