విజయ్ దేవరకొండ కెరీర్లో చెప్పుకోదగ్గ ఫ్లాపుల్లో డియర్ కామ్రేడ్ ఒకటి. కాన్సెప్ట్ బాగానే ఉన్నా ఎగ్జిక్యూషన్ లోపాల వల్ల ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ థియేటర్ల దగ్గర లాంగ్ రన్ తెచ్చుకోలేదు. అయితే జస్టిన్ ప్రభాకర్ కంపోజ్ చేసిన పాటలకు మాత్రం మంచి కల్ట్ ఫాలోయింగ్ ఉంది.
దీన్ని రీమేక్ చేయాలనీ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ రిలీజ్ కు ముందే అప్పట్లోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కానీ బొమ్మ తేడా కొట్టడంతో ఆ సంగతి అందరూ మర్చిపోయారు. తాజాగా ముంబై వర్గాల్లో మరోసారి ఇది చర్చకు వచ్చింది.
సిద్ధాంత్ చతుర్వేది హీరోగా డియర్ కామ్రేడ్ హిందీలో రూపొందుతుందనే ప్రచారం గత రెండు రోజులుగా ఊపందుకుంది. దాన్ని సదరు హీరో ఇన్స్ టా వేదికగా ఖండించాడు. విజయ్, రష్మిక మందన్న తనకు వ్యక్తిగతంగా ఇష్టమని, కానీ ఆ సినిమాలో నటించే ఉద్దేశం లేదని కుండ బద్దలు కొట్టాడు. రీమేక్స్ ఆలోచనే లేదని తేల్చి చెప్పాడు.
అయినా ఎప్పుడో వెళ్ళిపోయిన మూవీని ఇప్పుడు మళ్ళీ తీయాలనుకోవడం అంత తెలివైన ఆలోచన కాదనేది ఒప్పుకోవాలి. ఎందుకంటే హిందీలో ఈ మధ్య ఇవి పెద్దగా రిజల్ట్స్ ఇవ్వడం లేదు. దృశ్యం, షైతాన్ లాంటి ఒకటి రెండు మినహాయించి అన్నీ ఫ్లాప్ అయ్యాయి.
అయితే కరణ్ జోహార్ ఆలోచన మరోలా ఉంది. డియర్ కామ్రేడ్ కు ముఖ్యమైన మార్పులు చేసి, తెలుగు వెర్షన్ లో ఉన్న తప్పులను సరిచేస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఆయనలో ఉందట. అందుకే ఇంతగా తపించిపోతున్నారని అనుకోవచ్చు.
2019లో రిలీజైన డియర్ కామ్రేడ్ వచ్చి ఏడు సంవత్సరాలయ్యింది. దాని దర్శకుడు భరత్ కమ్మ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏం మూవీ చేస్తున్నాడో కూడా క్లారిటీ లేదు. అయినా సరే తన డెబ్యూ మీద నార్త్ మేకర్స్ ఆసక్తి చూపించడం మంచి విషయమే. సయారా, తేరే ఇష్క్ మే లాంటి సినిమాలు చూశాక డియర్ కామ్రేడ్ రీమేక్ వర్కౌట్ కావొచ్చని అంచనా లేకపోలేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates