ఇటీవల సీనియర్ నటుడు శివాజీ.. మహిళల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యల మీద పెద్ద దుమారమే రేగిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ యాంకర్, నటి అనసూయ చేసిన కామెంట్ల మీద సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. జబర్దస్త్ షోలో వివిధ సందర్భాల్లో ఆమె ప్రవర్తన, తన కామెంట్లు, మహిళల మీద బాడీ షేమింగ్ జరిగినపుడు తన స్పందనకు సంబంధించి అనేక పాత వీడియోలను పట్టుకొచ్చి ఆమె మీద గట్టిగా ఎటాక్ చేశారు నెటిజన్లు.
ముఖ్యంగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన రాశి ఫలాలు-రాశి గారు ఫలాలు జోక్‌ను హైపర్ ఆదితో కలిసి ఒక ఎపిసోడ్లో అనసూయ రీక్రియేట్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. ఇది ఒకప్పటి కథానాయిక రాశి దృష్టికి వచ్చి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి జోక్ అనసూయ నోటి నుంచి రావడం.. జడ్జి స్థానంలో ఉన్న రోజా నవ్వడం మీద ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను వారి స్థానంలో ఆ జోక్ గురించి అభ్యంతరం చెప్పేదాన్నని ఆమె అన్నారు.
ఈ నేపథ్యంలో అనసూయ.. రాశికి సారీ చెబుతూ ఒక పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందులో ఆమె.. ”రాశి గారు మీకు క్షమాపణలు. మూడు ఏళ్ల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్‌లో మీ పేరుని ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగింది. ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది. కానీ అప్పటికినాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించేదు. అది పొరపాటే.
దయజేసి నా క్షమాపణనుల అంగీకరించండి. వెనక్కి వెళ్లి ఇప్పుడు నేను దాన్ని సరిదిద్దలేను, పీపుల్ ఇప్పుడు చాలా మారిపోయారు, చాలా ఎదిగారు. ఆ షోలో డబుల్ మీనింగ్ డైలాగ్ లను ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచి పెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చు. ఈ రోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి హేట్ కంపెయిన్ నడిపిస్తున్నారు. నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకు ఎంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలను.
ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా, చెప్పకపోయిన నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణ చెబుతున్నా. మహిళల శరీరం గురించి చేసే కామెంట్లపై స్పందించే విషయంలో గతంలో కంటే ఇప్పుడు నేను చాలా బలంగా, సాధికారికంగా మారాను. ఇది మీరు అర్థం చేసుకుని మద్దతుగా ఉంటారని భావిస్తున్నా” అని అనసూయ పేర్కొంది. ఈ పోస్టు కింద అనసూయ కామెంట్లను డిజేబుల్ చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates