చిరు.. విజ‌య్.. బాల‌య్య‌.. ఒక రీమేక్ స్టోరీ

త‌మిళ అగ్ర క‌థానాయ‌కుడు విజ‌య్ చివ‌రి సినిమా జ‌న‌నాయ‌గ‌న్ ఈ సంక్రాంతి కానుక‌గా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా తెలుగు హిట్ భ‌గ‌వంత్ కేస‌రికి రీమేకా కాదా అనే విష‌యంలో నెల‌కొన్న స‌స్పెన్సుకు ట్రైల‌ర్ లాంచ్‌తో తెర‌ప‌డిపోయింది.

బాల‌య్య సినిమా ఆధారంగానే ఈ సినిమాను తెర‌కెక్కించార‌ని అర్థ‌మైపోయింది. చిన్న చిన్న మార్పులు చేశార‌నే సంకేతాల‌ను ట్రైల‌ర్ ఇచ్చింది. విజ‌య్ పొలిటిక‌ల్ మైలేజీకి ఉప‌యోగ‌ప‌డేలా డైలాగులు పెట్టారు. ఇంకేదో ఒక ట్రాక్ జోడించారు. 

ట్రైల‌ర్ రిలీజ్ కాక‌ముందు వ‌ర‌కు ఇది రీమేక్ కాదంటూ చెప్పుకున్న విజ‌య్ అభిమానుల‌తో టాలీవుడ్ ఫ్యాన్స్.. ముఖ్యంగా బాల‌య్య అభిమానులు గొడ‌వ ప‌డుతున్నారు. నిన్న‌ట్నుంచి దీని మీద ఫ్యాన్ వార్స్ గ‌ట్టిగానే జ‌రుగుతున్నాయి. ఐతే రీమేక్ చేయ‌డం ఈ రోజుల్లో పెద్ద రిస్క్ అన్న‌ది వాస్త‌వం. అలా అని అదేమీ పెద్ద పాపం కాదు.

కొంద‌రు హీరోలు రీమేక్‌ల మీద ఎక్కువ ఆస‌క్తి చూపిస్తారు. కొంద‌రు హీరోలు వాటి ప‌ట్ల వ్య‌తిరేక భావంతో ఉంటారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో రీమేక్‌ల ప‌ట్ల ఆస‌క్తి చూపించ‌ని హీరోల్లో బాల‌య్య ఒక‌డు. బాల‌య్య కెరీర్లో రీమేక్‌లు లేవ‌ని కాదు. ఆయన జర్నీ మొదట్లో ఎక్కువ రీమేక్ లే చేసినప్పటికీ… గత కొన్ని సంవత్సరాలుగా వాటిని పూర్తిగా తగ్గించేశారు. మ‌హేష్ బాబు, అల్లు అర్జున్ అస్స‌లు రీమేక్‌ల‌ జోలికి వెళ్ల‌రు.

ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. విజ‌య్ బాల‌య్య సినిమాను రీమేక్ చేసిన సంద‌ర్భంగా ఒక ఆస‌క్తిక‌ర విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. గ‌తంలో త‌మ్ముడు, ఒక్క‌డు, పోకిరి స‌హా ఎన్నో తెలుగు సినిమాల‌ను రీమేక్ చేసిన విజ‌య్.. మ‌ధ్య‌లో క్వాలిటీ ఒరిజిన‌ల్ మూవీస్ చేశాడు. అత‌డి సినిమాల‌ను ఇక్క‌డి హీరోలు రీమేక్ కోసం ఎంచుకున్నారు. అందులో క‌త్తి ఒక‌టి. 

ఆ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ మూవీ కోసం ఎంచుకున్నారు. ప‌దేళ్లు రాజ‌కీయాల్లో ఉన్న చిరు.. తిరిగి సినిమాల్లోకి రావాల‌నుకున్న‌పుడు ఎన్నో క‌థ‌లు విన్నా సంతృప్తి ద‌క్క‌పోవ‌డంతో త‌న రీఎంట్రీ కోసం విజ‌య్ మూవీని రీమేక్ చేశారు. ఐతే ఇప్పుడు విజ‌య్ సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లోకి అడుగు పెడుతూ.. చివ‌రగా చేసిన సినిమాకు మ‌న టాలీవుడ్ సీనియ‌ర్ హీరోల్లో ఒక‌రైన బాల‌య్య మూవీని ఎంచుకున్నాడు. ఈ ఆస‌క్తిక‌ర విష‌యం గురించి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చ‌ర్చ న‌డుస్తోంది.