మాళ‌విక డెబ్యూ… విజయ్ తో అనుకుంటే ప్రభాస్ తో

పెద్ద‌గా సినిమాలు చేయ‌క‌ముందే త‌న హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది మ‌ల‌యాళ భామ మాళ‌విక మోహ‌న‌న్. మ‌హ‌ర్షి స‌హా ప‌లు చిత్రాల్లో విజువ‌ల్ మాయాజాలం చేసిన సీనియ‌ర్ సినిమాటోగ్రాఫ‌ర్ కేయూ మోహ‌న‌న్ త‌న‌యురాలే మాళ‌విక‌. త‌మిళం, మ‌ల‌యాళంలో చాలా ఏళ్ల ముందే సినిమాలు చేసిన మాళ‌విక.. తెలుగులోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది.

ఈ సంక్రాంతి రేసులో ముందుగా రిలీజ‌వుతున్న రాజాసాబ్.. తెలుగులో త‌న తొలి చిత్రం. నిజానికి మాళ‌విక చాలా ముందుగానే తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాల్సింది. త‌న తొలి చిత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో అనౌన్స్ అయింది. వీరి క‌ల‌యిక‌లో ఆనంద్ అన్నామ‌లై అనే త‌మిళ ద‌ర్శ‌కుడు హీరో అనే సినిమా చేయ‌డానికి అన్నీ సిద్ధం చేశాడు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ‌లో భారీ బ‌డ్జెట్లో సినిమా చేయ‌డానికి ముందుకొచ్చింది. షూట్ కూడా మొద‌లైంది. కానీ ఒక షెడ్యూల్ త‌ర్వాత ఏవో కార‌ణాల‌తో సినిమా ఆగిపోయింది. తొలి షెడ్యూల్‌కే భారీగా ఖ‌ర్చ‌వ‌డంతో ఈ సినిమాను వ‌ర్క‌వుట్ చేయ‌డం క‌ష్ట‌మ‌నే ఉద్దేశంతో దీన్ని ఆపేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.

విజ‌య్‌తో ఆగిపోయిన త‌న సినిమా గురించి మాళ‌విక గుల్టే ఇంట‌ర్వ్యూలో స్పందించింది. ఆ సినిమా క‌థ చాలా బాగుంటుంద‌ని.. ల‌వ్ స్టోరీ కావ‌డంతో తాను ఆ సినిమా విష‌యంలో చాలా ఎగ్జైట్ అయ్యానని మాళ‌విక చెప్పింది. విజ‌య్‌తో అప్ప‌టికే మంచి స్నేహం ఉండ‌డం, మైత్రీ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తుండ‌డంతో సంతోషంగా ఈ సినిమా ఒప‌పుకున్నాన‌ని ఆమె అంది.

ఐతే విజ‌య్ ఆ సినిమా బ‌దులు లైగ‌ర్ చేయాల‌ని అనుకోవ‌డంతో కొంత షూటింగ త‌ర్వాత‌ ఆ సినిమా ఆగింద‌ని, అలా త‌న తెలుగు డెబ్యూ అప్పుడు మిస్స‌యింద‌ని మాళ‌విక చెప్పింది. త‌ర్వాత స‌లార్ సినిమాకు త‌న‌తో టీం సంప్ర‌దింపులు జ‌రిపిన మాట వాస్త‌వ‌మే అని.. కానీ అగ్రిమెంట్ లాంటిదేమీ జ‌ర‌గ‌లేద‌ని.. డేట్లు స‌ర్దుబాటు కాక‌పోవ‌డం, వేరే ఇబ్బందుల వ‌ల్ల తాను ఆ సినిమా చేయ‌లేక‌పోయాన‌ని మాళ‌విక వెల్ల‌డించింది.

త‌ర్వాత కూడా త‌న‌కు తెలుగు నుంచి చాలా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని.. కానీ పెద్ద సినిమాతో, త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌మున్న చిత్రంతో డెబ్యూ చేయాల‌నే ఉద్దేశంతోనే ఇంత కాలం ఆగాన‌ని.. రాజాసాబ్ లాంటి మూవీతో తెలుగులోకి అరంగేట్రం చేయ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ఆమె చెప్పింది.