అనుకున్నంతా అయ్యింది. బాలయ్య భగవంత్ కేసరి రీమేకే విజయ్ జన నాయకుడనే ప్రచారానికి ఫైనల్ గా ట్రైలర్ రూపంలో అధికారిక ముద్ర పడింది. మూడు నిమిషాలకు దగ్గరగా ఉన్న వీడియోలో ఏదీ దాచకుండా ఉన్నది ఉన్నట్టు చూపించారు. బాలకృష్ణ పాత్రలో విజయ్ ఎంట్రీ ఇవ్వగా, శ్రీలీల ప్లేస్ మమిత బైజు తీసుకుంది.
కాజల్ అగర్వాల్ బదులు పూజా హెగ్డే రాగా అర్జున్ రాంపాల్ వేసిన క్యారెక్టర్ బాబీ డియోల్ తో చేయించారు. సాటి పోలీస్ ఆఫీసర్ కు ఇచ్చిన మాట కోసం ఆయన కూతురిని ఆర్మీలో చేర్పించే బాధ్యత తీసుకున్న హీరో కథే జన నాయకుడు. మెయిన్ పాయింట్ యధాతధంగా తీసుకున్నారు.
జైల్లో ఇంట్రడక్షన్, మమితను కిడ్నాప్ చేసి ఫ్యాక్టరీలో దాచి పెడితే విజయ్ వచ్చి కాపాడటం, అడవిలో ఫైట్, ఫ్లాష్ బ్యాక్ లో పోలీస్ ఆఫీసర్ గెటప్ వగైరాలన్నీ భగవంత్ కేసరి నుంచి పెద్దగా మార్పులు చేయకుండా వాడుకున్నారు. అయితే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లేముందు చివరి సినిమా కావడంతో కథలో ఉన్న పొలిటికల్ థ్రెడ్స్ లో కొన్ని కీలకమైన మార్పులు చేశారు.
ప్రకాష్ రాజ్ తో పాటు ఇతర క్యాస్టింగ్ దీని కోసం వాడుకున్నారు. అవినీతి, దుర్మార్గం తదితర అంశాలను టచ్ చేస్తూ సీరియస్ గా మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. రీమేక్ హ్యాండిల్ చేయడంలో మంచి నైపుణ్యం ఉన్న దర్శకుడు హెచ్ వినోత్ మరోసారి తన చేతివాటం చూపించాడు.
ఇదంతా ఓకే కానీ ఇప్పుడీ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరం. తెలిసిన కథ అందులోనూ బాలయ్య లాంటి బ్లాక్ బస్టర్ హీరో నటించిన మూవీ ఇప్పటికే ఓటిటి, శాటిలైట్ ఛానల్స్ బోలెడుసార్లు చూసేశారు. మళ్ళీ అదే కథను రిపీట్ చేయడం అందులోనూ ఇంత సంక్రాంతి పోటీలోనూ పట్టుబట్టి విడుదలకు రెడీ కావడం ఆశ్చర్యం కలిగించే విషయం.
అనిరుద్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో పెద్దగా మేజిక్ కనిపించలేదు. మేకింగ్ చాలా రిచ్ గా ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా విజయ్ తమిళ ఫ్యాన్స్ కు మాత్రం జన నాయకుడు ఫుల్ మీల్స్ పెట్టడం ఖాయంగా ట్రైలర్ నమ్మకాన్ని కలిగించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates