బన్నీ దగ్గర ఆగిన లోకేష్ బండి?

గత ఏడాది కూలీ రూపంలో పెద్ద షాక్ తిన్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ తర్వాత ఏ సినిమా ఒప్పుకోలేదు. హీరోగా సన్ పిక్చర్స్ నిర్మించే మూవీలో బిజీ అయ్యాక డైరెక్షన్ వైపు ఫోకస్ తగ్గిందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ చూస్తుంటే ఆ భయం అక్కర్లేదులా ఉంది.

ఎందుకంటే విశ్వసనీయ వర్గాల ప్రకారం అల్లు అర్జున్ ని మెప్పించడంలో లోకేష్ సక్సెస్ అయ్యాడని ఫిలిం నగర్ టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే అవకాశమున్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి సంబంధించిన చర్చలు ఇటీవలే హైదరాబాద్ లో జరిగాయట. లైన్ పరంగా ఇంప్రెస్ అయిన బన్నీ త్వరలోనే ఫుల్ వెర్షన్ వింటానని చెప్పడం పాజిటివ్ సైన్.

ఒకరకంగా చూస్తే అల్లు అర్జున్ తీసుకుంటున్నది తెలివైన నిర్ణయమే. ఎందుకంటే కేవలం కూలి రిజల్ట్ ని బట్టి లోకేష్ కనగరాజ్ స్థాయిని తగ్గించి చూడలేం. పైగా ఎక్కడ పొరపాటు చేశానో అర్థమయ్యిందని అతనే స్వయంగా ఒప్పుకోవడం చూస్తే ఈసారి కంటెంట్ మీద పూర్తి స్థాయి శ్రద్ధ పెడతాడని చెప్పొచ్చు.

అసలే రజనీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ చేయి దాకా వచ్చి జారిపోయింది. సో తన సత్తా ఏంటో చూపించాలంటే బన్నీ కంటే పెద్ద స్టార్ దొరకడు. ఎలాగూ అట్లీ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో రూపొందుతోంది కాబట్టి దాని తర్వాత వచ్చే మూవీగా లోకేష్ కు పెద్ద మార్కెట్ సిద్ధంగా ఉంటుంది.

ఇక అట్లీ సినిమా విషయానికి వస్తే అక్టోబర్ దాకా దీని షూటింగ్ జరిగేలా ఉంది. అప్పటిదాకా బన్నీ లాకైపోయినట్టే. ఆ తర్వాతే లోకేష్ సెట్స్ లో అడుగు పెట్టొచ్చు. అయితే అధికారిక ప్రకటన వచ్చే దాకా ఖరారుగా చెప్పలేం. ప్రస్తుతానికి ప్రతిపాదన స్టేజిలోనే ఉందంటున్నారు కానీ అంతర్గత వర్గాలు మాత్రం దాదాపు ఫిక్సని చెబుతున్నాయి.

జానర్ ఖచ్చితంగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందని వేరే చెప్పనక్కర్లేదు. ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ అన్నీ పెండింగ్ పెట్టేసిన లోకేష్ కనగరాజ్ ఎలాగూ అమీర్ ఖాన్ మూవీ కూడా సాధ్యమయ్యేలా లేదు కాబట్టి బన్నీ కోసం అన్ని అస్త్రాలు వాడి బెస్ట్ సినిమా ఇవ్వాల్సిందే.