ఎవరా ఫేక్ ప్రొడ్యూసర్?

ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం కోసం ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు అడ్వాన్సులిచ్చి.. ఏవో సమస్యలొచ్చి ఆ సినిమాను ఆపేయడం ఇండస్ట్రీలో మామూలే. కానీ సినిమా చేసే ఉద్దేశం లేకపోయినా.. ఊరికే అడ్వాన్సులిచ్చి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను తన వైపు తిప్పించుకుని.. తర్వాత సినిమా లేదు ఏం లేదు అని చెప్పే నిర్మాత కూడా ఇండస్ట్రీలో ఉంటారని ఎవరైనా అనుకుంటారా?

ఇలాంటి ఓ వ్యక్తి టాలీవుడ్లో ఉన్నాడని అంటున్నాడు ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘ఈషా’ చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించిన యువ నటుడు అఖిల్ రాజ్. తనతో ఒక నిర్మాత అలాగే ఆడుకున్నట్లు అతను మా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘‘ఒక నిర్మాత సినిమా ఓపెనింగ్ చేశాడు. అతను ఫేక్ ప్రొడ్యూసర్. ఊరికే ఆరు నెలలు టైం వేస్ట్ చేశాడు. అడ్వాన్స్ రెండు మూడు లక్షలు ఇచ్చాడు కానీ.. సినిమా మాత్రం చేయలేదు. ఆఫీసుకు పిలుస్తున్నాడు. హుక్కా కొడుతున్నాడు. ముచ్చట్లు చెబుతున్నాడు. ఏదో తేడా కొడుతోందే అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే.. ఆయనకొక సరదా అంట అది. ప్రతి ఆరు నెలలకో హీరోనో, హీరోయిన్లనో పిలిచి కొన్ని లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వాళ్లను ఆపుతాడట. అదేం సరదానో నాకు అర్థం కాలేదు’’ అని అఖిల్ రాజ్ వెల్లడించాడు.

మరోవైపు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం అయిన ‘దొరసాని’ సినిమాలో తాను లీడ్ రోల్ చేయాల్సిందని అఖిల్ రాజ్ తెలిపాడు. ఆ సినిమాకు ఆడిషన్ ఇచ్చానని.. ఆ సినిమాతో తన అరంగేట్రం జరగాల్సిందని.. డెబ్యూకు చాలా దగ్గరగా వెళ్లాక కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తాను చేయలేకపోయానని అఖిల్ రాజ్ తెలిపాడు.