సంక్రాంతి ప్రీమియర్లకు రేట్లు ఇవేనా?

మెగాస్టార్ చిరంజీవి కొంత గ్యాప్ త‌ర్వాత బాక్సాఫీస్ వేట‌కు సిద్ధ‌మ‌య్యారు. భోళా శంక‌ర్‌తో ఘోర‌మైన ఫ‌లితాన్ని అందుకున్న చిరు.. రెండున్న‌రేళ్ల విరామం త‌ర్వాత త‌న కొత్త చిత్రం మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు చిత్రంతో ప్రేక్ష‌కులను ప‌ల‌క‌రించ‌బోతున్నారు. హిట్ మెషీన్‌గా పేరున్న అనిల్ రావిపూడి డైరెక్ట్ చేయ‌డం.. పైగా వెంకీ ప్ర‌త్యేక పాత్ర పోషించ‌డం.. అందులోనూ సంక్రాంతికి రిలీజ‌వుతుండ‌డంతో ఈ సినిమా క‌చ్చితంగా పెద్ద హిట్ట‌వుతుంద‌నే అంచ‌నాలున్నాయి.

జ‌న‌వ‌రి 12న సోమ‌వారం నాడు ఈ చిత్రం రిలీజ్ కానుంది. అంత‌కు ఒక్క రోజు ముందే చిరు సినిమాకు పెయిడ్ ప్రిమియ‌ర్స్ ప‌డ‌బోతున్నాయి. ఈ మ‌ధ్య ప్ర‌తి పెద్ద సినిమాకూ ముందు రోజు సెకండ్ షోను పెయిడ్ ప్రిమియ‌ర్‌గా వేస్తున్నారు. ఆ షోకు స్పెష‌ల్ రేటు కూడా ఉంటుంది. ఐతే మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు ప‌క్కా ఫ్యామిలీ మూవీ కావ‌డంతో ప్రిమియ‌ర్ రేటును రీజ‌న‌బుల్‌గానే పెడుతున్న‌ట్లు స‌మాచారం.

బాల‌య్య చిత్రం అఖండ‌-2కు ప్రిమియ‌ర్ రేటు రూ.600 పెట్టారు. సంక్రాంతికి పోటీ ఎక్కువ‌గా ఉండ‌డం, ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకుని మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌కు మంచి క్రేజే ఉన్న‌ప్ప‌టికీ.. అతి త‌క్కువ ప్రిమియ‌ర్ రేటు పెడుతున్న‌ట్లు స‌మాచారం. ఏపీలో ఈ షోలు, రేట్లకు అనుమ‌తులు రావ‌డం లాంఛ‌న‌మే. తెలంగాణ సంగ‌తే స‌స్పెన్సుగా మారింది.

ఇక్క‌డ స్పెష‌ల్ షోలు, అద‌న‌పు రేట్ల విష‌యంలో కేసులు ప‌డుతుండ‌డం.. ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా ఇందుకు సుముఖంగా లేక‌పోవ‌డం తెలిసిందే. మ‌రోవైపు సంక్రాంతి రేసులో ముందుగా రానున్న ప్ర‌భాస్ మూవీ రాజాసాబ్‌కు కూడా ముందు రోజు పెయిడ్ ప్రిమియ‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి రూ.800 రేటు పెట్టాల‌ని చూస్తున్నార‌ట‌.

సంక్రాంతి సినిమాల్లో మిగ‌తా చిత్రాల‌కు ఎక్స్‌ట్రా రేట్లు ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రి రెండు పెద్ద సినిమాల‌కు తెలంగాణ‌లో పెయిడ్ ప్రిమియ‌ర్లు, అద‌న‌పు రేట్ల‌కు అనుమ‌తులు వ‌స్తాయా లేదా అన్న‌ది కొన్ని రోజుల్లో తేలిపోతుంది. రాజాసాబ్‌కు ఛాన్స్ ఇస్తే మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌కు కూడా అవ‌కాశం ఉంటుంది. దీనికి లేదంటే దానికీ లేన‌ట్లే.