‘స్లమ్ డాగ్’ సౌండ్ లేదేంటి?

దర్శకుడు పూరి జగన్నాథ్ కంబ్యాక్ మూవీగా షూటింగ్ మొదలైనప్పటి నుంచే పాజిటివ్ వైబ్స్ మోస్తున్న స్లమ్ డాగ్ ( ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణ పూర్తి చేసుకుని నెల రోజులు దాటేసింది. అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ వాళ్ళ నిరీక్షణ ఫలించడం లేదు.

విజయ్ సేతుపతి, సంయుక్త మీనన్ జంటగా నటించిన ఈ మనీ క్రైమ్ డ్రామాలో టబు ఒక ప్రధాన పాత్ర పోషించగా వీరసింహారెడ్డితో మనకు పరిచయమైన కన్నడ హీరో దునియా విజయ్ మరోసారి మెయిన్ విలన్ గా కనిపించనున్నాడు. ఆ మధ్య విజయ్ సేతుపతి తన సోషల్ మీడియా హ్యాండిల్ లో షూట్ ఓవరని కూడా ట్వీట్ చేశారు.

నిన్న నూతన సంవత్సర సందర్భంగా సుమారు అరవైకి పైగా పెద్ద చిన్న సినిమాలు తమ అప్డేట్స్ ని పోస్టర్స్, గ్రీటింగ్స్ రూపంలో పంచుకున్నాయి. ఎవరికీ తెలియనివి కూడా అందులో ఉన్నాయి. కానీ స్లమ్ డాగ్ ఊసే లేకపోవడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచింది. నిజానికి టైటిల్ రివీల్ ని గత ఏడాదే చేద్దామనుకున్నారు.

కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకున్నారు. తీరా చూస్తే తర్వాత ఎలాంటి సౌండ్ లేకపోవడం విచిత్రం. ఇన్ సైడ్ టాక్ అయితే ఓటిటి డీల్ కు సంబంధించి చర్చలు ఇంకా పూర్తి కాకపోవడంతో, అవి అయ్యాకే బిజినెస్ డీల్స్, రిలీజ్ డేట్ వగైరా ఫైనల్ చేయాలని నిర్ణయించుకున్నారట.

కొత్త ఏడాదిలో రిలీజ్ స్లాట్లు టైట్ గా ఉన్నాయి. సంక్రాంతి నుంచి డిసెంబర్ దాకా ముందే కర్చీఫ్ లు వేసుకుంటున్నారు. అలాంటప్పుడు స్లమ్ డాగ్ కాస్త ముందస్తు ప్లానింగ్ తో ఉండటం అవసరం. లైగర్, డబుల్ ఇస్మార్ట్  దారుణంగా దెబ్బ కొట్టడంతో పూరి జగన్నాథ్ ఒకరకమైన కసి మీద ఉన్నారు.

విజయ్ సేతుపతితో గట్టి హిట్టు పడితే అటు తమిళంలోనూ మార్కెట్ ఓపెనవుతుంది. కోలీవుడ్ హీరోలతో చేసే ఛాన్స్ దొరుకుతుంది. కాకపోతే కంటెంట్ అదిరిపోయిందనిపించుకోవాలి. బిచ్చగాడు, కుబేర తరహా విభిన్నమైన పాయింట్ తో రూపొందిన స్లమ్ డాగ్ లో వర్తమాన సామజిక, రాజకీయ సంఘటనలు చాలానే ఉంటాయట.