అనిల్ మార్కు కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు

కేవలం పదకొండు రోజుల్లో మన శంకరవరప్రసాద్ గారు విడుదల కానుంది. నాలుగో తేదీ ట్రైలర్ లాంచ్, ఏడు లేదా మరో డేట్ కి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చిన మూడు పాటలు పాసైపోగా మీసాల పిల్ల నెంబర్ వన్ ప్లేస్ అందుకుంది. చిరు వెంకీ కాంబో సాంగ్ తొలుత అటుఇటు అనిపించినా వినగా వినగా ఎక్కేస్తోంది.

ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అనిల్ రావిపూడి మార్కు ప్రమోషన్లు ఇంకా మొదలుకాకపోవడం పట్ల అభిమానులు కొంత అసంతృప్తితో ఉన్నారు. పోస్టర్లు కూడా పెద్దగా కిక్ ఇవ్వడం లేదు. న్యూ ఇయర్ సందర్భంగా వదిలిన స్టిల్ అయితే ఏదో ఏఐ వాడి చేసినట్టు ఉందని కామెంట్స్ వచ్చాయి.

గత ఏడాది ఇదే టైంలో సంక్రాంతికి వస్తున్నాంకి అనిల్ చేసిన హడావిడి వేరే లెవెల్ లో ఉండేది. వెంకటేష్ తో నేను పాడతా అంటూ చేసిన వీడియో ప్రోమో ఓ రేంజ్ లో పేలింది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తో కలిసి వెంకీ పాట పాటలకు డాన్స్ చేయించిన క్లిప్ వేగంగా వైరల్ అయ్యింది. వనరులను ఏ స్థాయిలో వాడాలో అంతకన్నా ఎక్కువ పిండుకున్నాడు రావిపూడి.

ఇవి ఓపెనింగ్స్ మీద మంచి ప్రభావం చూపించాయి. ఇప్పుడు మన శంకరవరప్రసాద్ గారుకి ఇది ఫాలో కాకపోవడం విచిత్రం. చిరంజీవి తానుగా బయటికి వచ్చి అలాంటివి చేస్తే బాగోదేమో అని ఆలోచిస్తున్నారేమో కానీ గేరు మార్చాల్సిన అవసరమైతే వచ్చింది

అసలే కాంపిటీషన్ తీవ్రంగా ఉంది. థియేటర్ అగ్రిమెంట్ల దగ్గర నుంచి ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ దాకా ప్రతిదాంట్లోనూ కాంపిటీషన్ కనిపిస్తోంది. రాజా సాబ్ కనక పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే తర్వాత వచ్చే చిరంజీవి, రవితేజ సినిమాలతో సహా అన్నింటికీ పబ్లిసిటీ వేగం పెంచాల్సి ఉంటుంది.

మన శంకరవరప్రసాద్ గారు నుంచి ఇంకొక్క పాట రావాల్సి ఉంది. అది చిరంజీవి ఇంట్రో సాంగ్. మెగా గ్రేస్ ఇందులో చూస్తారని టీమ్ ఇప్పటికే తెగ ఊరించేసింది. నయనతారతో చేయించిన కొత్త ప్రోమోలో మీరు విడుదల తేదీ చెప్పడమే గొప్ప ఇంకేం అక్కర్లేదని అనిల్ రావిపూడి చెప్పడం చూస్తే ఆమె ఇక కనిపించదేమోనని డౌట్ రాక మానదు.