నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం అభిమానులు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ ఇదిగో అదిగో అంటూనే ఏళ్లు గడిచిపోయాయి. ఒక దశలో మోక్షజ్ఞ తీరు చూసి.. అతడికి సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదేమో అని ఆశలు వదులుకున్నారు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. మోక్షజ్ఞ లుక్ మార్చుకున్నాడు. సినిమాల కోసం శిక్షణ కూడా మొదలుపెట్టాడు.
గత ఏడాది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తన తొలి చిత్రాన్ని ప్రకటించారు. కానీ ఆ సినిమా ఓపెనింగ్ జరగబోతుండగా.. హఠాత్తుగా దానికి బ్రేక్ పడింది. ముందు అది జస్ట్ బ్రేక్ అనుకున్నారు. కానీ ఆ సినిమా పూర్తిగా ఆగిపోయిందని తర్వాతే అర్థమైంది. మళ్లీ ఆ సినిమా ఊసే వినిపించలేదు. మళ్లీ మోక్షజ్ఞ అరంగేట్రం గురించి అయోమయం నెలకొంది. అసలు అతను సినిమాల్లోకి వస్తాడా రాడా అన్న సందేహాలు ముసురుకున్నాయి.
ఈ మధ్య బాలయ్య, మోక్షజ్ఞ కాంబినేషన్లో ‘ఆదిత్య 999’ సినిమా అంటూ కొత్త వార్త తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రపోజల్ ఎప్పట్నుంచో ఉన్నదే కానీ.. ఇప్పుడది కార్యరూపం దాలుస్తున్నట్లు తెలుస్తోంది. విలక్షణ దర్శకుడు, బాలయ్యతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’, ‘యన్.టి.ఆర్’ చిత్రాలను రూపొందించిన క్రిష్ జాగర్లమూడినే ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాతోనే మోక్షజ్ఞ అరంగేట్రం చేయబోతుండడం ఖాయమట. ప్రస్తుతం ఆ సినిమా కోసం బాలయ్య తనయుడు కసరత్తులు చేస్తున్నాడట.
మోక్షజ్ఞ పాత్రకు తగ్గ లుక్‌లోకి మారే ప్రయత్నం చేస్తుండడంతో పాటు వర్క్ షాప్స్‌లో పాల్గొంటున్నట్లు సమాచారం. ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేయాలన్నది బాలయ్య ఎన్నో ఏళ్ల కల. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు ఎప్పుడో స్క్రిప్టు రెడీ చేశారు. కానీ వయసు మీద పడ్డ నేపథ్యంలో ఆయన డైరెక్ట్ చేసే పరిస్థితిలేదు. ఈ స్క్రిప్టుకు బాలయ్య ఎప్పుడో స్టోరీ బోర్డు కూడా వేయించారు. ఒక దశలో తనే డైరెక్ట్ చేయాలనుకున్నారు. కానీ తర్వాత ఆ ఆలోచనను మానుకుని క్రిష్ చేతికి ప్రాజెక్టు అప్పగించినట్లు తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates