ప్ర‌భాస్- హీరోయిన్… చీర వెనుక క‌థ‌

రాజాసాబ్‌లో ప్ర‌భాస్‌కు జోడీగా ముగ్గురు హీరోయిన్లు న‌టించారు. అందులో రిద్ధి కుమార్‌పై మొన్న అంద‌రి దృష్టీ నిలిచింది. రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మిగ‌తా ఇద్ద‌రు హీరోయిన్ల‌కు భిన్నంగా, చీర‌లో హాజ‌రైంది రిద్ధి. ఆ చీర ప్ర‌భాస్ గిఫ్ట్‌గా ఇచ్చింద‌ని చెబుతూ.. ఈ ఈవెంట్లో క‌ట్టుకోవ‌డం కోసం మూడేళ్ల పాటు దాన్ని దాచుకున్నాన‌ని రిద్ధి చెప్ప‌డంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ వీడియో ఆధారంగా ప్ర‌భాస్‌కు, రిద్ధికి లింక్ కూడా క‌లిపేశారు నెటిజ‌న్లు. ఐతే ఈ చీర వెనుక క‌థేంటో రిద్ధి ఒక ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

మూడేళ్ల ముందు రాజాసాబ్ సెట్లోకి అడుగు పెట్టినపుడు త‌న‌కు ప్ర‌భాస్ నుంచి ఈ గిఫ్ట్ అందిన‌ట్లు రిద్ధి చెప్పింది. అంత‌కంటే ముందు త‌న‌ పుట్టిన రోజు, దీపావ‌ళి రెంటినీ పుర‌స్క‌రించుకుని అప్పుడు ప్ర‌భాస్ యూనిట్లో అంద‌రికీ ప్ర‌భాస్ పార్టీ ఇచ్చాడ‌ని.. కానీ త‌న‌కు ఆహ్వానం అందిన‌ప్ప‌టికీ ముంబ‌యిలో ఉండ‌డం వ‌ల్ల దానికి హాజ‌రు కాలేక‌పోయాన‌ని రిద్ధి చెప్పింది. త‌ర్వాత ప్ర‌భాస్‌ను క‌లిసిన‌పుడు ముందుగా త‌నే ఆయ‌న‌కు ఒక బ‌హుమ‌తి ఇచ్చిన‌ట్లు రిద్ధి వెల్ల‌డించింది.

ప్ర‌భాస్‌కు ఉన్న దాన గుణాన్ని దృష్టిలో ఉంచుకుని తాను క‌ర్ణుడి మీద రాసిన ఒక పుస్త‌కాన్ని ఆయ‌న‌కు గిఫ్ట్‌గా ఇచ్చిన‌ట్లు రిద్ధి చెప్పింది. ఐతే ప్ర‌భాస్ దానికి చాలా ఆశ్చ‌ర్య‌పోయాడ‌ని.. అలా ఆశ్చ‌ర్య‌పోవ‌డానికి కార‌ణ‌మేంటో త‌ర్వాత తెలుస్తుంద‌ని చెప్పాడ‌ని రిద్ధి తెలిపింది. క‌ట్ చేస్తే క‌ల్కి సినిమాలో ప్ర‌భాస్ క‌ర్ణుడి పాత్ర చేయ‌డంతో త‌న‌తో అంత‌కుముందు అన్న మాటలు గుర్తుకు వ‌చ్చాయ‌ని, ఇది యాదృచ్ఛికంగా జ‌రిగింద‌ని రిద్ధి చెప్పుకొచ్చింది.

ఆ త‌ర్వాత త‌న‌కు ప్ర‌భాస్ నుంచి చీర బహుమ‌తిగా ల‌భించిన‌ట్లు ఆమె వెల్ల‌డించింది. ప్ర‌భాస్ గిఫ్ట్ ఇస్తున్నాడంటే చాక్లెట్లు లాంటివి ఉంటాయ‌ని భావించాన‌ని.. కానీ అంద‌మైన చీర‌ను గిఫ్ట్‌గా ఇవ్వ‌డంతో తాను చాలా ఆశ్చ‌ర్య‌పోయాన‌ని.. దాన్ని చాలా ప్ర‌త్యేకంగా భావించి రాజాసాబ్ ప్రి రిలీజ్ ఈవెంట్లోనే క‌ట్టుకోవాల‌నే ఉద్దేశంతో అలాగే దాచిపెట్టుకున్న‌ట్లు ఆమె తెలిపింది.