జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ నుంచి ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్, రెండు పొడవైన టీజర్లు వచ్చినప్పటికీ ఇంకేదో కావాలనే తపన అభిమానుల్లో తీరలేదు. కథని వీలైనంత వరకు రివీల్ చేసినా బజ్ పూర్తి స్థాయిలో పెరిగేందుకు అవి సరిపోలేదనే కామెంట్స్ ఓపెన్ గానే వినిపించాయి.
ఇంత పెద్ద బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీకి నెక్స్ట్ లెవెల్ అనిపించే కంటెంట్ కావాలని అభిమానులు కోరుకున్నారు. రిలీజ్ కు పదకొండు రోజుల ముందు దర్శకుడు మారుతీ దాన్ని ఇచ్చేశారు. కొత్త ట్రైలర్ రూపంలో అన్నింటికీ సమాధానం చెప్పేశారు. డౌట్లన్నీ క్లియర్ చేశారు.
నాన్నమ్మ గంగ (జరీనా వహాబ్) అంటే మనవడు రాజా( ప్రభాస్) కి ప్రాణం.అయితే చనిపోయిన తాతయ్య కనకరాజు (సంజయ్ దత్) ని మర్చిపోలేకపోతున్న ఆమె కోరిక మేరకు తమ పూర్వీకుల ఆస్తి అయిన పెద్ద మహల్ లోకి అడుగు పెడతాడు రాజా. అక్కడ తాత ఇచ్చే స్వాగతం భయంకరంగా ఉంటుంది.
భూతాలతో పాటు ప్రాణాల మీద కొచ్చే ఎన్నో సంఘటనలు చోటు చేసుకుంటాయి. బయటికి వెళ్లాలంటే కనకరాజు ఇచ్చే సవాల్ తీసుకోవాలి. అసలు రాజా సాబ్ లక్ష్యం ఏంటి, అతని తండ్రి ఎవరు, ఇంత వ్యూహం వెనుక కారణం ఏమిటి, ముగ్గురు భామలు ఎవరనే ప్రశ్నలకు సమాధానం జనవరి 9 తెలుస్తుంది.
కొత్త విజువల్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇచ్చేలా ఉంది. స్టోరీ అరటిపండు వలిచినట్టు చెప్పేయడంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ క్వాలిటీని మరింత మెరుగ్గా చూపించడం అంచనాలు పెంచేలా ఉంది. చివరి షాట్ లో ప్రభాస్ నే దెయ్యం టైపులో చూపించడం కొత్త ట్విస్టు.
తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆల్రెడీ టీజర్స్ లో ఉన్నదే కొనసాగించగా ఈసారి హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లను పైపైన చూపించి మేనేజ్ చేశారు. ఒక ప్యాన్ ఇండియా స్టార్ హీరో హారర్ కామెడీ చేయడం చాలా సంవత్సరాల తర్వాత జరుగుతోంది. క్లిక్ అయితే మాత్రం వసూళ్ల ఊచకోత ఖాయం.
Gulte Telugu Telugu Political and Movie News Updates