ఇంకో మూడు రోజుల్లో 2025 అయిపోతుంది. అక్కడి నుంచి సంక్రాంతి కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఈసారి ఎక్కువ సినిమాలు ఉండటంతో బిజినెస్ వ్యవహారాలు అంత సులభంగా తేలడం లేదు. పైకి ఎవరికి వారు అన్ని ఏరియాలు అమ్మేసినట్టు కనిపిస్తున్నా ఇంకా పెద్ద మొత్తంలో అడ్వాన్సులు నిర్మాతల చేతికి రావాలని ట్రేడ్ మాట.
మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అయినట్టు ఈసారి ఏకంగా అరడజను రిలీజులు పోటీలో ఉండటంతో బయ్యర్లు ఒకరకమైన సందిగ్ధంలో ఉన్నారు. రాజా సాబ్ జనవరి 9 ముందు వచ్చే అడ్వాంటేజ్ ని ఫుల్లుగా వాడుకుంటుంది కానీ 12 నుంచి అసలైన సవాల్ ఉంటుంది.
బజ్ ఎంత ఉందనేది పక్కన పెడితే మన శంకరవరప్రసాద్ గారుకి చిరంజీవి-వెంకటేష్ కాంబోతో పాటు అనిల్ రావిపూడి బ్రాండ్ కింది సెంటర్లలో బాగా పని చేస్తోంది. రాజా సాబ్ మూడు రోజులు ఎంజాయ్ చేసినా ఆ తర్వాత మిగిలిన సినిమాలతో స్క్రీన్లు పంచుకోవాల్సి ఉంటుంది. అదే జరిగితే వసూళ్ల మీద ప్రభావం పడుతుంది కాబట్టి ఇక్కడ టాక్ రావడం చాలా కీలకం.
భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారిలకు వాటి రేంజ్ కు తగ్గట్టు స్క్రీన్లు తెచ్చుకోవడం కోసం మినీ యుద్ధాలే చేస్తున్నాయట. ఇవి చాలవన్నట్టు జన నాయకుడుకి పివిఆర్ ఐనాక్స్ మద్దతు దొరకడంతో మల్టీప్లెక్సుల స్క్రీన్లలో కొంత కోత పడుతుంది.
ఇవన్నీ సునిశితంగా గమనిస్తున్న డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలతో ఇంకా బేరసారాలు చేస్తూనే ఉన్నారని వినికిడి. ప్రొడ్యూసర్లు ఎంతైతే భారీ మొత్తాలు ఆశిస్తున్నారో వాటి కన్నా తక్కువే చేతికి అందేలా ఉందని సమాచారం. ఒకవేళ ఏవైనా సినిమాలు యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ఆటోమేటిక్ గా సర్దుబాట్లు చేసుకుని ఫ్లాపులకు ఇచ్చిన స్క్రీన్లు తగ్గించేలా అంతర్గత ఒప్పందాలు జరుగుతున్నాయని సమాచారం.
కాకపోతే ఇప్పుడీ పండగ పందెంలో ఎవరిని ఎక్కువ నమ్మాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. అందుకే హడావిడి పడకుండా బయ్యర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అన్నట్టు జనవరి 10 పరాశక్తి తెలుగులో వస్తుందో లేదో మరోసారి కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. అది కూడా ఎస్ అంటే సమస్య మరింత జఠిలమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates