ప్రభాస్‌తో పని చేసే ప్రతి ఆర్టిస్టూ, టెక్నీషియనూ తన పెద్ద మనసు గురించి చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా కడుపు పగిలేలా తన ఇంటి విందు భోజనాలు పెట్టించి చంపేస్తుంటాడని సరదాగా వ్యాఖ్యానిస్తుంటారు తనతో పని చేసిన యూనిట్ సభ్యులు. ప్రభాస్‌తో కొత్తగా సినిమా చేసే వాళ్లందరూ.. ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే క్యారేజీలు, రకరకాల వంటల గురించి పోస్టులు పెట్టడం మ్యాండేటరీ అన్నట్లే.
ఐతే ప్రభాస్ ప్రేమ కేవలం ఫుడ్డుతోనే ఆగిపోదు. వేరే బహుమతులు కూడా అందజేస్తుంటాడు. ఇలా రెబల్ స్టార్ తనకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ గురించి యంగ్ హీరోయిన్ రిద్ధి కుమార్ వెల్లడించింది. ప్రభాస్ తనకు అందమైన చీరను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. ఆమె ప్రభాస్‌తో కలిసి ‘రాజాసాబ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.
నిన్న హైదరాబాద్‌లో ‘రాజాసాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు రిద్ధి ఎంతో అందమైన తెల్లటి డిజైనర్ చీరలో వచ్చింది. ఈ చీరను మూడేళ్ల ముందు ‘రాజాసాబ్’ సినిమా మొదలైన కొత్తలో ప్రభాస్ బహుమతిగా ఇచ్చాడట. ప్రి రిలీజ్ ఈవెంట్లోనే ఈ చీరను కట్టుకోవాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు దాన్ని అలాగే దాచి ఉంచానని.. ఇప్పుడు దాన్ని ధరించే అవకాశం వచ్చిందని రిద్ధి తెలిపింది.
‘రాజాసాబ్’లో ఉన్న ముగ్గురు అందమైన హీరోయిన్లలో రిద్ధి ఒకరు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లతో పాటు రిద్ధికి కూడా సినిమాలో కీలక పాత్రే దక్కినట్లు కనిపిస్తోంది. రిద్ధి కెరీర్లో ఇది చాలా పెద్ద అవకావం అనే చెప్పాలి. ఆమె రాజ్ తరుణ్ సరసన ‘లవర్’ అనే చిన్న సినిమాతో కథానాయికగా పరిచయం అయింది. తర్వాత కొన్ని చిన్న చిత్రాల్లో నటించింది. ప్రభాస్ మూవీ ‘రాధేశ్యామ్’లో చిన్న పాత్ర చేసిన ఆమెకు.. ‘రాజాసాబ్’లో కథానాయికల్లో ఒకరిగా నటించే అవకాశం దక్కింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates