నాయకుడి కోసం సెలవు తీసుకున్న నటుడు

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలకు శాశ్వతంగా సెలవు చెప్పేశాడు. ఇకపై ప్రజాసేవ కోసం రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకోవడంతో జన నాయకుడు చివరి మూవీ కానుంది. నిన్న మలేషియాలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది.

లక్షలాదిగా వచ్చిన అభిమానులతో ప్రాంగణం కోలాహలంగా మారింది. టీమ్ తో పాటు దర్శకులు అట్లీ, నెల్సన్ దిలీప్ కుమార్ తదితరులు ప్రత్యేక గెస్టులుగా విచ్చేయడంతో పాటు తలపతితో తమకున్న అనుబంధాన్ని గొప్పగా గుర్తు చేసుకున్నారు. సుమారు ఆరు గంటల పాటు జరిగిన ఈ వేడుకని జీ5 ఓటిటి, ఛానల్లో త్వరలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు.

చెప్పుకోదగ్గ ఆకర్షణలు తలపతి తిరువిజాలో చాలా జరిగాయి. విజయ్ స్టేజి మీద చివరి స్టెప్పు అంటూ కొన్ని సెకండ్లు డాన్స్ చేయడం, మమిత బైజు తన స్పీచ్ లో ఎమోషనల్ కావడం, విజయ్ తో పని చేసిన దర్శకులు ఆయన గొప్పదనాన్ని వివరించడం, నాజర్ తన కొడుకు బాగవ్వడంలో విజయ్ పాత్రని చెప్పడం తదితరాలన్నీ భావోద్వేగాలకు గురి చేశాయి.

విజయ్ పేరు పేరునా తనను ఈ స్థాయికి తెచ్చినవాళ్లను గుర్తు చేసుకుని ఎన్నో జ్ఞాపకాలను పంచుకోవడం హైలైట్ గా నిలిచింది. ఎక్కడా రాజకీయ ప్రస్తావన లేకుండా, పార్టీ గురించి మాట్లాడకుండా మలేషియా అధికారుల సూచనలకు మేరకు నడుచుకున్నారు.

రాబోయే ఎన్నికల్లో గెలుస్తాడో లేదో చెప్పలేం కానీ యాక్టింగ్ రిటైర్ మెంట్ ని విజయ్ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో ఇలా చెప్పి మళ్ళీ పరిశ్రమకు వచ్చిన కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లా కాకుండా కంప్లీట్ పొలిటిక్స్ వైపే దృష్టి పెట్టనున్నట్టు పార్టీ వర్గాలు బల్లగుద్ది చెబుతున్నాయి.

విజయ్ చివరి సినిమాగా జన నాయకుడు మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తెలుగులోనూ జనవరి 9 రిలీజ్ చేయబోతున్నారు. ఓపెనింగ్స్ తోనే కాదు ఫైనల్ రన్ లోనూ కనివిని ఎరుగని రికార్డులు జన నాయకుడు సొంతం చేసుకుంటుందని విజయ్ ఫ్యాన్స్ తో పాటు బయ్యర్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.