మాములుగా ప్రభాస్ ఎంత తన స్వంత సినిమా ఈవెంట్ అయినా సరే తక్కువగా మాట్లాడ్డం చాలాసార్లు చూశాం. స్వతహాగా తనలో ఉండే బిడియం కావొచ్చు, ఇంకోటి కావొచ్చు, పూర్తి స్థాయిలో ఓపెన్ కావడం అరుదు. కానీ రాజా సాబ్ వేడుకలో కొత్త డార్లింగ్ కనిపించాడు. రూపంలోనే కాదు అది మాటల్లోనూ బయట పడింది.
గుబురు గెడ్డం, వెనుక చిన్న పిలకతో స్పిరిట్ గెటప్ రివీల్ చేయడం ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. ఇక డార్లింగ్స్ ఐ లవ్ యు అంటూ ఎప్పటిలాగే తన ప్రేమను ప్రదర్శిస్తూ మొదలుపెట్టిన ప్రభాస్ ఒక్కొక్కరిని పొగిడే క్రమంలో ప్రత్యేకతను చాటుకున్నాడు. నిర్మాత విశ్వప్రసాద్ అసలు హీరో అంటూ ఆకాశానికి ఎత్తేశాడు.
సంక్రాంతికి చాలా సినిమాలు వస్తున్నాయి, అన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి, ముఖ్యంగా సీనియర్లవి బాగా ఆడాలి, వాళ్ళ తర్వాతే మేము, వాళ్ళ నుంచి నేర్చుకున్నవే చేస్తున్నాం అంటూ చిరంజీవి – వెంకటేష్ మన శంకరవరప్రసాద్ గురించి ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించడం ఆకట్టుకుంది. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా రేసులో ఉంది కాబట్టి అన్నీ కలిపి ఇలా అడ్రెస్ చేశాడన్న మాట.
అన్నీ హిట్టవ్వాలని కోరుకోవడం నచ్చేసింది. 15 సంవత్సరాల తర్వాత మారుతీ ఎంటర్ టైన్మెంట్ ఇస్తున్నాడని, ఇక చూసుకోండి ఏ స్థాయిలో ఉంటుందోనని చెబుతూ ఆయన డెడికేషన్ గురించి స్పీచ్ మధ్యలో ప్రస్తావిస్తూనే ఉన్నాడు.
మొత్తానికి మాటలతో మనసులు గెలుచుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇంత చలిలో రావడం గురించి చెబుతూ ఇబ్బంది పడకండి అని హితవు చెప్పడం మరింత స్పెషల్ అనిపించుకుంది. రాజా సాబ్ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్న ప్రభాస్ దాన్ని ప్రసంగం రూపంలో బయటపెట్టాడు.
సో కాంపిటీషన్ ఎంత ఉందనేది పక్కనపెడితే కంటెంట్ కనక సాలిడ్ గా కనెక్ట్ అయితే రికార్డులు బద్దలు కావడం ఖాయం. ఎస్కెఎన్ అన్నట్టు ఈసారి పందెం కోళ్ల మీద కాదు డైనోసార్ మీద అన్న మాట నిజమవుతుంది. జనవరి 9 థియేటర్లలో అడుగు పెట్టబోతున్న రాజా సాబ్ మూడు గంటల పది నిమిషాల నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates