సమయం ముంచుకొస్తోంది వరప్రసాద్ గారూ

మన శంకరవరప్రసాద్ గారు విడుదలకు ఇంకో 17 రోజులు మాత్రమే టైం ఉంది. మాములుగా అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో చేసే ప్రమోషన్లు కనిపించక మెగా ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. అవుట్ డోర్ పబ్లిసిటీ, థియేటర్లకు కొత్త హోర్డింగులు పంపించడం లాంటివి బాగానే ఉన్నా, అసలైన సోషల్ మీడియా సౌండ్ వినిపించకపోవడం అభిమానుల ఆందోళనకు కారణమవుతోంది.

అలాని అనిల్ మరీ బిజీగా లేరు. బయట ఈవెంట్లకు గెస్టుగా వస్తున్నారు. టీవీ షోలలో కనిపిస్తున్నారు. నిత్యం తన ప్రెజెన్స్ ఉండేలా ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ వాటిలో మెగా స్టాంప్ కనిపించడం లేదనేది నెటిజెన్ల కామెంట్.

అసలే పోటీ తీవ్రంగా ఉంది. నాలుగు రోజుల ముందే రాజా సాబ్ వచ్చి ఉంటుంది. అప్పటికి వారం అయ్యుండదు కాబట్టి శంకర వరప్రసాద్ గారికి కాంపిటీషన్ పరంగా ప్రభాస్ నుంచి థ్రెట్ అయితే పక్కా. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు అనిల్ రావిపూడి నవంబర్ చివరి వారం నుంచే వెరైటీ ప్రోమోలతో హడావిడి మొదలుపెట్టారు.

కానీ ఇప్పుడు డిసెంబర్ చివరికి వస్తున్నా సరైన టీజర్ రాలేదు. రెండు పాటల్లో మీసాల పిల్ల చార్ట్ బస్టర్ కాగా శశిరేఖా ప్రసాదూ ఓకే అనిపించుకునే స్పందన దక్కించుకుంది. కానీ బజ్ పెంచేందుకు ఇవి ఎంత మాత్రం సరిపోవన్నది ఒప్పుకోవాల్సిన విషయం.

అసలే భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత చిరంజీవి రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకున్నారు. ఒకపక్క ట్రోలింగ్ చేసేందుకు యాంటీ ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇంకోవైపు అరడజను సినిమాలతో పోటీ చాలా తీవ్రంగా ఉంది. రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు రేంజ్ లో వింటేజ్ మెగాస్టార్ ని బయటికి తీశానని చెబుతున్న అనిల్ రావిపూడి వాటి తాలూకు శాంపిల్స్ ని అప్పుడప్పుడు బయటికి వదులుతూ ఉంటే హైప్ మరింత పెరుగుతుంది.

వెంకటేష్ పాత్రని కూడా ప్రమోషన్లలో వాడుకోవాలి. ఇంకో రెండు పాటలు రిలీజ్ చేయాల్సి ఉంది. ఏది ఏమైనా అనిల్ రావిపూడి పరుగులు పెట్టే ప్రమోషన్లు చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.