డబ్బింగ్ బొమ్మలకు కష్టాలు తప్పవు

అనుకున్నట్టే సంక్రాంతి పండక్కు థియేటర్ల పంచాయితీ తప్పేలా లేదు. తెలుగు స్ట్రెయిట్ సినిమాలే అయిదు వస్తుండటంతో డబ్బింగ్ రూపంలో రిలీజ్ కావాల్సిన జన నాయకుడు, పరాశక్తికి కనీస స్క్రీన్లు దొరికేలా లేవని ట్రేడ్ టాక్. హైదరాబాద్ లాంటి నగరాల్లో మేనేజ్ చేయొచ్చు కానీ మిగిలిన బిసి సెంటర్లలో పంపకాలు చాలా ఇబ్బందిగా మారతాయి. ఎందుకంటే మన సినిమాలకు క్రేజ్ ప్రతిదానికి విడిగా ఉండటంతో, బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ వాడుకుని వేగంగా అగ్రిమెంట్లు చేసుకునేందుకు పరుగులు పెడుతున్నాయి. నైజామ్ వరకు చూసుకుంటే కనీసం మూడు సినిమాలకు దిల్ రాజు పంపిణి బాధ్యతలు తీసుకోవచ్చని టాక్ ఉంది.

రాజా సాబ్ కు వారానికి సరిపడా ఒప్పందాలు ముందస్తుగా జరిగిపోతున్నాయి. జనవరి 9నే వస్తుంది కాబట్టి ముందు వన్ వీక్ అగ్రిమెంట్ చేసుకుని, తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఆటోమాటిక్ గా థియేటర్లు పెరుగుతాయనే ధీమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో కనిపిస్తోంది. మన శంకరవరప్రసాద్ కు సైతం వ్యవహారాలను వేగంగా చక్కబెడుతోంది. ఏరియాల వారిగా బిజినెస్ దాదాపు క్లోజ్ అయ్యింది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఎక్కువ ఆశ పడకుండా సరిపోయేంత దొరికితే చాలాని సంతోషపడుతోంది. అనగనగాఒక రాజు, నారి నారి నడుమ మురారిలు డీసెంట్ నెంబర్ థియేటర్లు దొరికేలా ప్లానింగ్ లో ఉంది.

సరిగ్గా రెండేళ్ల క్రితం జరిగిన సంక్రాంతి ఫీట్ మళ్ళీ రిపీట్ అయ్యేలా ఉంది. 2024 జనవరిలో పండగ స్లాట్లు ఖాళీ లేక శివ కార్తికేయన్ అయలన్, ధనుష్ కెప్టెన్ మిల్లర్ రెండు తెలుగు వెర్షన్లూ వాయిదా పడ్డాయి. తర్వాత గ్యాప్ ఇచ్చి ఒకటి రిలీజ్ చేశారు, మనోళ్లు పట్టించుకోలేదు. హనుమాన్ ఫీవర్ లో అవన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఈ పండక్కు కూడా సేమ్ సీన్ కనిపిస్తోంది. జన నాయకుడు, పరాశక్తికి మన దగ్గర అనూహ్యమైన హైప్ అయితే లేదు. తప్పదనుకుంటే తెలుగులో ఒక వారం పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉంది. కానీ మన నిర్మాతలు మహా మొండివాళ్ళు. ఇంత టైట్ సిచువేషన్ లో తెచ్చినా తెస్తారేమో.