ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా బుక్ మై షో క్రాష్ అయ్యింది. కల్కి పబ్లిసిటీ మీద నాగ అశ్విన్ దృష్టి పెట్టకపోయినా ఓపెనింగ్ రికార్డులు బద్దలైపోయాయి. కేవలం ప్రభాస్ ఇమేజ్ మీద రాధే శ్యామ్ బాలీవుడ్ లో వర్కౌట్ చేసుకుంది. కానీ రాజా సాబ్ విషయంలో ఇలాంటి మేజిక్ ఇంకా పూర్తి స్థాయిలో కనిపించడం లేదు. కారణం రెండు టీజర్లు, రెండు పాటలు ఆశించిన స్థాయిలో హైప్ పెంచకపోవడమే. ఫీడ్ బ్యాక్ పాజిటివ్ గా ఉంది కానీ దాని తాలూకు మేజిక్ ఆన్ లైన్, అఫ్ లైన్ రెండింటిలోనూ కనిపించాలి.

ఇది ఆషామాషీ ప్యాన్ ఇండియా మూవీ కాదు. నాలుగు వందల కోట్ల దాకా బడ్జెట్ అయ్యింది. సోలోగా అయితే ఈ డిస్కషన్ ఉండేది కాదు. కానీ అవతల కాంపిటీషన్ లో అరడజను సినిమాలున్నాయి. ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఎంత ప్రభాస్ అయినా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలంతా రాజా సాబ్ చూడరుగా. ఆప్షన్లు ఎక్కువగా ఉన్నప్పుడు ప్రాధాన్యతలు మారిపోతాయి. టాకులు, రివ్యూలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. పండగ సీజన్లో హీరో ఇమేజ్ ని బట్టి కాకుండా ఏది బాగుందనే మాటలను బట్టి వసూళ్లు మారిపోతాయి. అందులోనూ టికెట్ రేట్లు పెంచుకునే ట్రెండ్ లో కాంపిటీషన్ పెద్ద పాములా మారిపోయింది.

సో నెక్స్ట్ రాజా సాబ్ నుంచి వచ్చే ఏ కంటెంట్ అయినా ఎక్స్ ట్రాడినరిగా ఉండాలి. ఒకవైపు అనిల్ రావిపూడి మన శంకరవరప్రసాద్ గారు పబ్లిసిటీ స్పీడ్ పెంచేశాడు. సింపుల్ గా చేసినట్టు అనిపిస్తుంది కానీ ఇంపాక్ట్ పెద్దగా వచ్చేలా చేయడం తన స్టయల్. ఇంకోవైపు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ రంగంలోకి దిగుతున్నారు. సో ఇవన్నీ రాజా సాబ్ ని కవ్వించేవే. బాహుబలి నుంచి ప్రభాస్ కు దక్కినవన్నీ సోలో రిలీజులు. మొదటిసారి ఇంత పోటీలో దిగుతున్నాడు. సో భుజాల పై బరువు కొంచెం తగ్గాలంటే తమన్, మారుతీ నుంచి బ్యాన్గర్ అనిపించే మెటీరియల్ రావాలి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముందే ఇస్తారేమో చూడాలి.