గత దశాబ్ద కాలంలో జోరు తగ్గించేశాడు కానీ.. నటన పరంగా, పాత్రలు, సినిమాల పరంగా కమల్ హాసన్ చేసినన్ని ప్రయోగాలు ఇండియాలో మరే నటుడూ చేసి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న కమల్.. కొన్నేళ్లుగా తన అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు.
సినిమాలకు దూరమైపోయి రాజకీయాలు, ఇతర విషయాలపై ఆయన దృష్టిసారించారు. ఇక ఆయన మళ్లీ నటించడేమో అన్న నిరాశలోకి అభిమానులు వెళ్లిపోయిన సమయంలో గత ఏడాది ఇండియన్-2ను మొదలుపెట్టారాయన. కానీ ఆ సినిమాకు అడుగడుగునా ఆటంకాలు తప్పట్లేదు. ఇండియన్-2 భవిష్యత్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఐతే ఈ మధ్యే విక్రమ్ పేరుతో తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన అభిమానుల్ని మురిపించాడు కమల్.
ఖైదీ సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ రూపొందించనున్న ఈ చిత్రం ఎంత ఎగ్జైటింగ్‌గా ఉండబోతోందో ఈ మధ్యే రిలీజైన టీజర్ చూపించింది. అది చూశాక సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా చిత్రీకరణ అతి త్వరలో మొదలుపెట్టనున్నాడు లోకనాయకుడు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అని అర్థమవుతుండగా.. ఇందులో కమల్‌ను ఢీకొట్టే విలన్ పాత్రధారి ఎవరన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఆయన ముందు దీటుగా నిలబడే ఈ తరం నటులెవరా అని చూస్తున్నారు. కాగా విక్రమ్ మూవీలో విలన్ పాత్రకు మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ ఎంపికైనట్లు తాజా సమాచారం. అతడి నటన గురించి.. ఇప్పటిదాకా చేసిన సినిమాల గురించి చెప్పడానికి చాలానే ఉంది. గత దశాబ్దంలో ఇండియన్ సినిమాలో రైజ్ అయిన ఉత్తమ నటుల్లో అతనొకడు. కమల్‌కు ఎదురుగా అతను విలన్ పాత్రలో నటిస్తే వచ్చే కిక్కే వేరుగా ఉంటుందనడంలో సందేహం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates