ప్రభాస్ కోసం బాస్ వస్తారా

జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో ఓపెనింగ్స్ పరంగా భారీ రికార్డులు నమోదు కాబోతున్నాయి. నెంబర్ కనీసం వంద కోట్లతో మొదలవుతుందని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉండగా రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డిసెంబర్ 28 రామోజీ ఫిలిం సిటీలో చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. వారణాసి వేడుక ఇక్కడే ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. గతంలో సాహో కూడా ఇదే చోట ఈవెంట్ చేశారు. లక్షల్లో పోగయ్యే అభిమానులను దృష్టిలో ఉంచుకుని ఫిలిం సిటీ అయితేనే బెస్టని టీమ్ భావించిందట.

ఇదిలా ఉండగా రాజా సాబ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్, మెగా బాస్ ని ఒకే వేదిక మీద చూడటం కన్నా అభిమానులకు కన్నులపండగ ఇంకేముంటుంది. బయట ప్రైవేట్ గా కలుసుకున్నప్పుడు ప్రభాస్, చిరంజీవి చాలా సన్నిహితంగా ఉంటారు. మెగాస్టార్ మీద డార్లింగ్ కు ఎంత అభిమానముందో పలు సందర్భాల్లో బయట పడింది కూడా. పెదనాన్న కృష్ణంరాజు మన ఊరి పాండవులు సినిమా నుంచే ఈ ఫ్యామిలీతో చిరంజీవికి బాండింగ్ ఏర్పడిపోయింది. రాజా సాబ్ కోసం బాస్ వస్తే అది మరింత బలపడుతుంది.

వేదిక ఒకటే కాబట్టి రాజా సాబ్ ఏం చేసినా వారణాసితో పోలిక వస్తుంది కాబట్టి దాన్ని మించిపోయేలా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేయాలి. రాజమౌళి సైతం కంట్రోల్ చేయలేకపోయిన కొన్ని అపశ్రుతులు ఇక్కడ రిపీట్ కాకుండా చూసుకోవాలి. పండక్కు విపరీతమైన పోటీ ఉండటం వల్ల రాజా సాబ్ ప్రయాణం అంత ఈజీ కాదు. జనవరి 9 నుంచి 11 దాకా సోలో రిలీజ్ ఎంజాయ్ చేసినా ఆ తర్వాత వరసగా కొత్త రిలీజులు మూకుమ్మడిగా వచ్చేస్తాయి. ఆలోగా రాజా సాబ్ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఎలాంటి టెన్షన్లు ఉండవు. దర్శకుడు మారుతీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాటు అందరూ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.