చ‌ర‌ణ్‌ vs నాని.. ఇద్ద‌రూ త‌గ్గేదే లే

సినిమాలకు సంబంధించి క్రేజీ సీజ‌న్లకు చాలా ముందుగానే బెర్తులు బుక్ చేసేస్తుంటారు. తెలుగులో ఏడాది ఆరంభంలో సంక్రాంతి సీజ‌న్‌కు బాగా డిమాండ్ ఉంటుంది. ఆ త‌ర్వాత ఫోక‌స్ వేస‌వి మీదికి మ‌ళ్లుతుంది. మార్చి నెలాఖ‌రు నుంచే స‌మ్మ‌ర్ సినిమాల సంద‌డి మొద‌లైపోతుంది. వ‌చ్చే ఏడాది వేస‌విని ఆరంభించ‌డానికి మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ సినిమా పెద్ది, నేచుర‌ల్ స్టార్ నాని మూవీ ది ప్యార‌డైజ్ పోటీలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ రెండు చిత్రాల‌కూ మార్చి 26, 27 రిలీజ్ డేట్‌ లు గా ఎంచుకున్నారు. ఈ చిత్రాలు సెట్స్ మీదికి వెళ్ల‌డానికి ముందే డేట్ ఇచ్చేశారు.

కానీ రెండూ నిజంగానే పోటీలో ఉంటాయా అని ముందే సందేహాలు క‌లిగాయి. ఏదో ఒక‌టి రేసు నుంచి త‌ప్పుకోవ‌చ్చ‌నే చ‌ర్చ జ‌రిగింది. ఈ పోటీ గురించి నాని మాట్లాడుతూ.. రిలీజ్ టైంకి ఏం జ‌రుగుతుందో చూద్దాం అంటూనే.. రెండూ పోటీ ప‌డ్డా కూడా దేనిక‌దే బాగా ఆడుతుంద‌ని, రెంటికీ స్కోప్ ఉంటుంద‌ని వ్యాఖ్యానించాడు. ఐతే ఇటీవ‌ల ఇటు పెద్ది, అటు ది ప్యార‌డైజ్ మార్చి చివ‌రి వారంలో రిలీజ్ కాక‌పోవ‌చ్చ‌ని వార్త‌లు వ‌చ్చాయి. రెంటికీ అనుకున్న‌ట్లుగా షూటింగ్ షెడ్యూల్స్ జ‌ర‌గ‌ట్లేద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

కానీ ఈ రెండు చిత్రాల మేక‌ర్స్ ఒక‌రి త‌ర్వాత ఒక‌రు రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చేశారు. ముందుగా పెద్ది మేక‌ర్స్ రిలీజ్ గురించి తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. త‌మ సినిమా వాయిదా అంటూ జ‌రుగుతున్న ప్ర‌చారం గురించి ఖండించ‌డానికే  నిర్మాత స‌తీష్ కిలారు ఒక నోట్ రిలీజ్ చేశారు. అందులో మార్చి 27న ప‌క్కాగా త‌మ సినిమా రిలీజ‌వుతుంద‌ని నొక్కి వ‌క్కాణించారు. ఇక ది ప్యారడైజ్ మూవీ విష‌యానికి వ‌స్తే.. ఆదివారం ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని టీం ఒక స్పెష‌ల్ వీడియో రిలీజ్ చేసింది. అందులో రిలీజ్ మార్చి 26నే అని పేర్కొన్నారు. 

దీంతో ఈ రెండు చిత్రాల రిలీజ్ డేట్‌లు మార‌బోతున్న‌ట్లు వ‌స్తున్న రూమ‌ర్ల‌కు చెక్ ప‌డిన‌ట్ల‌యింది. ప్ర‌స్తుతం ఈ రెండు చిత్రాలూ స‌గానికి పైగానే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. జ‌న‌వరి చివ‌రిలోపు షూట్ అంతా అయిపోతే మార్చి నెలాఖ‌ర్లో రిలీజ్‌కు ఇబ్బంది లేన‌ట్లే. రెండూ పాన్ ఇండియా సినిమాలే కాబ‌ట్టి ప్ర‌మోష‌న్లు కూడా కొంచెం గ‌ట్టిగానే చేయాల్సి ఉంది. మ‌రి రెండు సినిమాలూ ప్ర‌క‌టించిన రిలీజ్ డేట్‌కే క‌ట్టుబ‌డి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర చ‌ర‌ణ్ వెర్స‌స్ నాని పోరును చూస్తామా?