పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం గబ్బర్ సింగ్ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. కానీ వీరి కలయికలో రెండో సినిమా రావడానికి చాలా సమయం పట్టేసింది. మధ్యలో భవదీయుడు భగత్ సింగ్ అనే ఓ సినిమాను అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు. తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ మొదలైంది. ఇది కూడా పూర్తి కావడానికి చాలా టైం పట్టింది.
ఈ సినిమా రీమేకా.. స్ట్రెయిట్ ఫిలిమా అనే విషయంలోనూ అందరిలో సందేహాలున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి తొలి పాటను లాంచ్ చేసిన సందర్భంగా హైదరాబాద్‌లోని ఆదిత్య కాలేజీలో హరీష్ శంకర్.. ఈ సినిమా తెర వెనుక విషయాల గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఎందుకు లేటైంది.. కథ ఎన్నిసార్లు, ఎందుకు మారింది.. అసలిది రీమేకా కాదా అనే విషయాలపై హరీష్ మాట్లాడాడు. ఇంతకీ అతనేమన్నాడంటే..?
ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మాట్లాడడానికి దొరికిన తొలి వేదిక ఇదే కాబట్టి ఇక్కడ చెబుతున్నా. వేరే ఈవెంట్లకు వెళ్తే అప్‌డేట్ అప్‌డేట్ అని ఫ్యాన్స్ అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడే సమయం వచ్చింది. ఈ సినిమా మీద వెబ్ సైట్లు, టీవీ ఛానెళ్లలో, యూట్యూబ్ ఛానెళ్లలో చాలా రకాల వార్తలు వచ్చాయి. అందరూ రాసింది ఏంటంటే.. ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం పవన్ కళ్యాణ్ అని.
ఈ రోజు ఆదిత్య కాలేజీ వేదికగా అందరికీ ఒక మాట చెబుతున్నా. ఈ సినిమా పవన్ కళ్యాణ్ వల్ల ఆలస్యం కాలేదు. ముందు మేం ఒక కథ అనుకున్నాం. గబ్బర్ సింగ్‌లో బాగా మాస్‌గా చూపించాను. కాబట్టి ఆయన్ని జల్సా, ఖుషి తరహాలో కాలేజీ స్టోరీలో చూపించాలి అనుకున్నాను. అందుకు అనుగుణంగా కథ రాసుకున్నా. కానీ అది కొంచెం క్లాస్‌గా ఉంది అనిపించింది. ఫ్యాన్స్ కోరుకున్నది వేరు అని అర్థమై ఆ ఐడియా డ్రాప్ చేద్దాం అనుకున్నాం.
అంతలో కరోనా వచ్చింది. ఆ టైంలో నేను మెంటల్ డిప్రెషన్‌కు వెళ్లిపోయాను.నా మెంటల్ హెల్త్ బాగా దెబ్బ తింది. దాన్నుంచి బయటపడి పవన్ గారితో ఒక రీమేక్ చేద్దాం అనుకున్నాం. కానీ ఆ కథ మీద కూడా సందేహాలు కలిగాయి. చివరికి ఆయన ఇమేజ్‌కు, అభిమానుల ఆకాంక్షలకు తగ్గ కథతో సినిమాను మొదలుపెట్టాం.
ప్రకృతి ఈ సినిమాకు సరిగ్గా సహకరించింది. అందుకే చాలా వేగంగా సినిమా పూర్తయింది. పవన్ గారు సూపర్ ఫాస్ట్‌గా సినిమా చేశారు కాబట్టే త్వరగా పూర్తయింది. ఉదయం అమరావతిలో ఆయన కేబినెట్ మీటింగ్‌లో పాల్గొని.. రాత్రికి షూటింగ్‌కు వచ్చేసేవాళ్లు. తెల్లవారుజామున వరకు షూటింగ్‌లో పాల్గొని, జస్ట్ స్నానం చేసి విజయవాడకు వెళ్లిపోయేవారు. ఆయన 18-20 గంటల పాటు పని చేసిన రోజులున్నాయి అని హరీష్ శంకర్ చెప్పాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates