ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే నెగెటివ్ క్యాంపైనింగే సోషల్ మీడియాను ముంచెత్తుతోంది. వాళ్ళ సినిమా వచ్చినపుడు వీళ్ళు డ్యూటీ చేస్తే.. వీళ్ళ సినిమా వచ్చినపుడు వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఐతే అభిమానులు ఇలా ఫ్యాన్ వార్స్ తో రెచ్చిపోతుంటారు కానీ హీరోలు మాత్రం ఒకరితో ఒకరు సఖ్యతతోనే ఉంటారనే విషయం ఎప్పటికప్పుడు రుజువు అవుతూనే ఉంటుంది.
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో భాగమైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ మధ్య మంచి అనుబంధమే ఉన్న సంగతి తెలిసిందే. వీరి ఫ్యాన్స్ మాత్రం ఎప్పట్లాగే సోషల్ మీడియాలో యుద్ధాలు కొనసాగిస్తున్నారు. అయితే పవన్ కోసం బాలయ్య ఎలాంటి త్యాగం చేశాడో అఖండ 2 దర్శకుడు బోయపాటి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
పవన్ సినిమా ఓజీ.. బాలయ్య మూవీ అఖండ 2 దసరాకు ఒకే తేదీన రావాల్సింది. కానీ బాలయ్య మూవీ వాయిదా పడింది. ఐతే సినిమా పూర్తి కాకే పోస్ట్ పోన్ అయిందని అంతా అనుకున్నారు. కానీ పవన్ మూవీ కోసమే అఖండ 2ను బాలయ్య తన చిత్రాన్ని వాయిదా వేయించినట్లు బోయపాటి వెల్లడించాడు.
“మా సినిమా షూటింగ్ డిసెంబరులో మొదలు పెట్టి జూన్ చివరికల్లా పూర్తి చేశాం. జార్జియాలో క్లైమాక్స్ షూట్ చేసుకుని వచ్చేశాం. ఆగస్టు 10 కల్లా రీ రికార్డింగ్ కూడా అయిపోయింది. కానీ ఇంతలో వేరే సినిమాలు వచ్చాయి. ఓజీ కూడా దసరాకే వస్తుంది అంటే.. ఒకరి మీద ఒకరు పడడం ఎందుకు అనుకున్నాం. ఇండస్ట్రీ అంటే ఒక కుటుంబం. అందరూ బాగుండాలి.
అందుకే తమ్ముడి సినిమా ఓజీకి దారి ఇద్దాం అని బాలయ్య అన్నారు. అందులో ఏముంది. మనం తర్వాత వద్దాం అన్నారు. అఖండ డిసెంబర్ 2న వచ్చింది. ఈసారి డిసెంబర్ 5న వద్దాం అని బాలయ్య చెప్పాం. అన్నట్లే ఓజీకి దారి ఇచ్చాం. ఆ సినిమా బాగా ఆడింది. పరిశ్రమకు ఊపిరి వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుందాం అనుకున్నాం” అని బోయపాటి వెల్లడించాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates