కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే. సమంత, తమన్నా, అనుష్క.. వీళ్లందరి నుంచి గట్టి పోటీ ఉన్నా సరే వారిని మించి పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని ఒక దశాబ్దం పాటు ఒక వెలుగు వెలిగింది చందమామ. ఐతే హీరోయిన్లకు మరీ సుదీర్ఘ కెరీర్‌ను ఆశిస్తే కష్టమే.
కాజల్ కూడా అందుకు మినహాయింపు కాలేకపోయింది. కొన్నేళ్ల ముందు ఆమెకు అవకాశాలు తగ్గడం మొదలైంది. అదే సమయంలో పెళ్లి చేసుకుంది. దీంతో కెరీర్ ఇంకా స్లో అయిపోయింది. ఆచార్య సినిమాలో నటించినా ఆమె సన్నివేశాలు థియేటర్లలో కనిపించలేదు. ‘భగవంత్ కేసరి’తో హిట్టు కొట్టినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు తెలుగులో దాదాపుగా అవకాాశాలు లేని స్థితికి చేరుకుంది కాజల్.
ఇలాంటి టైంలో కాజల్ ఒక వెబ్ సిరీస్ చేయడానికి సిద్ధమైంది. జియో హాట్ స్టార్ వాళ్లు దాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. హిందీలో విజయవంతం అయిన ‘ఆర్య’కు ఇది రీమేక్ అట. ‘ఆర్య’ కూడా ఒక విదేశీ సిరీస్‌కు రీమేక్. దాన్ని ఇప్పుడు దక్షిణాదిన రీమేక్ చేస్తున్నారు.
కాజల్ తమిళులకు కూడా బాగానే పరిచయం కాబట్టి అక్కడ కూడా దీన్ని రిలీజ్ చేస్తారు. ఐతే ‘ఆర్య’ ప్రస్తుతం ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులో ఉంది. కాజల్ చేస్తోంది అంటే.. హిందీకి పరిమితం చేసి మిగతా భాషల్లో ఆడియో తీసేస్తారన్నమాట.
హిందీ వెర్షన్లో సుస్మితా సేన్ లీడ్ రోల్ చేసింది. ఆమెది నడి వయస్కురాలి పాత్ర. వయసుకు ఎదిగిన పిల్లలూ ఉంటారు. గ్లామర్ క్వీన్‌గా పేరున్న కాజల్.. అలాంటి పాత్రకు ఒప్పుకోవడం సాహసమే. ఇంతకుముందు కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే హార్రర్ వెబ్ సిరీస్‌లో నటించింది. కానీ అది ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయింది. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ వెబ్ సిరీస్ చేయనుంది. దీనికి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి మరి.
Gulte Telugu Telugu Political and Movie News Updates