తెలుగు సినీ పరిశ్రమకు ప్రస్తుతం అనధికార పెద్ద అంటే మెగాస్టార్ చిరంజీవి అనే చెప్పాలి. ఒకప్పుడు దాసరి నారాయణరావులా ఇప్పుడు చిరు వ్యవహరిస్తున్నారు. కానీ ఇండస్ట్రీ పెద్ద అనే పేరును మాత్రం ఆయన ఉపయోగించుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇండస్ట్రీ నుంచి ఏ విషయంలో అయినా లీడ్ తీసుకోవాలంటే ఆయనే ముందు నిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు సినీ రంగం నుంచి ముఖ్య అతిథిగా మెగాస్టార్‌నే ఆహ్వానించారు.
అందుకోసం సీనియర్ మంత్రి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఒక బృందం చిరు దగ్గరికి వెళ్లిందట. ఆ సమయంలో తాను ఎలాంటి పొజిషన్లో ఉన్నానో తెలుసా అంటూ ఆయనో ఆసక్తికర విషయం వెల్లడించారు గ్లోబల్ సమ్మిట్ ప్రసంగంలో. భట్టి విక్రమార్క బృందం తనను కలవడానికి వచ్చినపుడు తాను అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌లో ఉన్నానని చిరు వెల్లడించారు. ఆ సమయంలో తాను ఒక అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు.
మంత్రుల బృందం వచ్చినపుడు తాను అలా ఉండడం చూసి తనకే ఏదోలా అనిపించిందని.. వెంటనే షూటింగ్ ఆపించి.. అంతా క్లియర్ చేయించి వారిని కలవడానికి వెళ్లినట్లు చిరు తెలిపారు. తనను విక్రమార్క బృందం ఎంతో సాదరంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందని ఆయన చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. ఇది ఆయన మస్తిష్కం నుంచి పుట్టిన కార్యక్రమమని.. రేవంత్ రెడ్డికి ఫిలిం ఇండస్ట్రీ మీద ఎంతో గౌరవం ఉందని చిరు అన్నారు.
తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఒక గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన చిరు.. ఇది కేవలం చిరంజీవిని పిలిచినట్లు కాదని.. మొత్తం ఇండస్ట్రీనే ఆహ్వానించినట్లు అని చిరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను ఫిలిం హబ్‌గా చేయాలనే ఆలోచనను రెండేళ్ల ముందు రేవంత్ రెడ్డితో పంచుకున్నానని.. ఆయన ఆ దిశగా అడుగులు వేయడం.. సల్మాన్ ఖాన్, అజయ్ దేవగణ్ లాంటి వాళ్లు ఇక్కడ స్టూడియోలు కట్టడానికి ముందుకు రావడం శుభ పరిణామమని.. దీన్నుంచి తాము స్ఫూర్తి పొందుతామని చిరు అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates