అఖండ-2 రిలీజ్… అభిమానులే గెలిచారు

గత గురువారం మరి కొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో పెయిడ్ ప్రిమయర్స్ పడాల్సి ఉండగా.. అనూహ్యంగా అఖండ-2 సినిమాకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. తర్వాతి రోజు ఉదయానికన్నా షోలు మొదలవుతాయేమో అనుకుంటే అదీ జరగలేదు. ఒక రోజు ఆలస్యంగా కూడా సినిమా రిలీజ్ కాలేదు. దీంతో బాలయ్య కెరీర్లో మోస్ట్ హైప్డ్ మూవీకి ఇలా జరిగిందేమిటా అని నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఇక అప్పట్నుంచి కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈరోస్ సంస్థతో 14 రీల్స్ అధినేతలకు ఫైనాన్స్ వివాదం కోర్టు వరకు వెళ్లడం వల్లే సినిమా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ ఇష్యూ సెటిల్ కావడానికి మూణ్నాలుగు రోజులు సమయం పట్టింది. దీంతో కొత్త డేట్ కోసం క్రిస్మస్ సీజన్‌ను చూసుకుందామని మేకర్స్ అనుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లలో చాలామంది ఆ డేటే వద్దనుకున్నారు. బాలయ్య అభిమానులు సైతం అన్ని రోజులు వెయిట్ చేయలేమని.. 12నే సినిమాను రిలీజ్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. ఇందుకోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ కూడా చేశారు.

చివరికి అభిమానుల పంతమే గెలిచింది. 12నే సినిమా రిలీజ్ కాబోతోంది. ముందు రోజు రాత్రి పెయిడ్ ప్రిమియర్స్ కూడా పడబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య తన అభిమానుల అభిప్రాయాలకు ఎంత విలువ ఇస్తారో తెలిసిందే. దీనికి తోడు ఆన్ లైన్లో అభిమానులు ట్రెండ్ చేసే క్రమంలో చూపించిన అగ్రెషన్ చూసి మేకర్స్ భయపడ్డట్లే ఉన్నారు. 12న రిలీజ్ చేయడం ఒక దశలో అసాధ్యం అనిపించినా సరే.. చకచకా అన్ని ఏర్పాట్లు చేసుకుని సినిమాను శుక్రవారమే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

సినిమా వాయిదా పడడం అందరికీ తీవ్ర ఆవేదన కలిగించినప్పటికీ.. మరీ ఆలస్యం కాకుండా వారం వ్యవధిలోనే రిలీజ్ కాబోతుండడం గొప్ప ఉపశమనమే. మధ్యలో వచ్చిన బ్రేక్ వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కొంత నష్టం తప్పలేదు. కానీ సినిమాకు మంచి టాక్ వస్తే.. ఆ నష్టాన్ని రికవర్ చేయడం కష్టమేమీ కాదు. నందమూరి అభిమానులు ముందుకన్నా ఎక్కువగా ఈ సినిమాను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నారు. ‘అఖండ-2’ అఖండమైన విజయం సాధించాలని ఇండస్ట్రీ అంతా కూడా బలంగా కోరుకుంటోంది.