మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత పెద్ద హిట్టయిందో.. కాల క్రమంలో ఎలా కల్ట్ స్టేటస్ తెచ్చుకుందో తెలిసిందే. మళ్లీ ఈ కలయికలో సినిమా అనేసరికి వీళ్లిద్దరి అభిమానులూ ఎంతో ఎగ్జైట్ అయ్యారు. ఈ సినిమాను ప్రకటించి రెండేళ్లు దాటిపోయింది. ఐతే సుకుమార్ ఏడాది పాటు ‘పుష్ప: ది రూల్’కే అంకితమై ఉన్నాడు. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ పూర్తి చేసి ‘పెద్ది’లో బిజీ అయ్యాడు.
చరణ్ వచ్చే వేసవికి కానీ ఈ సినిమాకు అందుబాటులోకి రాడు కాబట్టి సుకుమార్‌కు బాగానే టైం దొరికింది. ‘పుష్ప-2’ గత ఏడాది డిసెంబర్లో రిలీజ్ కాగా.. అప్పట్నుంచి సుకుమార్ ఖాళీగానే ఉన్నాడు. ఏడాది టైం గడిచిపోయింది కాబట్టి ఈపాటికి స్క్రిప్టు రెడీ అయిపోయి ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. ఇదే అంచనాతో ఈ సినిమా షూటింగ్ గురించి ఊహాగానాలు మొదలుపెట్టేశారు. ఇదొక ఇంటర్నేషనల్ మూవీ అని.. ఇంగ్లిష్ భాషలో కూడా తెరకెక్కుతుందని.. విదేశాల్లోనే 50 శాతానికి పైగా చిత్రీకరణ జరగబోతోందని ఒక ప్రచారం నడుస్తోంది. ఈ అప్‌డేట్స్ విని అంతా నిజమే అనుకుని ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.
కానీ వాస్తవం ఏంటంటే.. ఇప్పటిదాకా చరణ్‌తో చేయబోయే సినిమాకు కథేంటన్నది కూడా ఫిక్స్ చేయలేదు సుకుమార్. ఆయన తన శిష్య బృందంతో కలిసి కొన్ని నెలలుగా కథా చర్చలు జరుపుతున్న మాట వాస్తవం. అందులో రెండు కథల మీద ప్రధానంగా డిస్కషన్లు సుదీర్ఘంగా సాగుతున్నాయి. కానీ వాటిలో ఏ కథనూ ఆయన ఫైనలైజ్ చేయలేదు. ఒకటి క్లాస్ టచ్ ఉన్న, కొంచెం మోడర్న్ టచ్ ఉన్న, విభిన్నమైన కథ అని సమాచారం. ఐతే ఆ కథ చేస్తే మరీ క్లాస్ అయిపోతుందేమో అనే అనుమానాలున్నాయి.
ఇంకో కథ ఊర మాస్‌గా ఉంటుందట. కానీ అది చేస్తే రంగస్థలం, పుష్ప తరహాలోనే మళ్లీ రూరల్, రగ్డ్ మూవీ చేసినట్లు అవుతుందే అని ఆలోచిస్తున్నారట. అందుకే ఈ రెండు కథల్లో ఏది చేయాలనే మీమాంసలో సుకుమార్ ఉన్నట్లు సమాచారం. ముందు కథ ఫైనలైజ్ చేశాక.. దాన్ని పూర్తి స్క్రిప్టుగా మార్చడానికి చాలా టైం పడుతుంది. చరణ్ అందుబాటులోకి వచ్చే సమయానికి కూడా స్క్రిప్టు రెడీ అవుతుందా అన్నది సందేహమే. కానీ సుకుమార్‌తో సినిమా అంటే ఇవన్నీ మామూలే కాబట్టి చరణ్ కొన్ని రోజులు ఖాళీగా ఉండక తప్పకపోవచ్చని యూనిట్ వర్గాలు అంటున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates