కరోనా టైంలో అందరూ భయంతో వణికిన వాళ్లే. ఈ మహమ్మారి మొదట్లో జనాల్ని ఎంతగా కంగారు పెట్టేసిందో తెలిసిందే. తొలిసారి లాక్ డౌన్ విధించిన సమయంలో మెజారిటీ జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఆర్థికంగా ఏ ఇబ్బంది లేని వాళ్లు, తమ అవసరాలు ఎలాగోలా తీరేవాళ్లు ఇల్లు దాటి బయట అడుగు పెట్టకుండా నెలలు నెలలు గడిపేశారు.
ముఖ్యంగా సెలబ్రెటీల్లో వయసు మళ్లిన వాళ్లు, అనారోగ్య సమస్యలున్నవాళ్లు ఎంతగానో నియంత్రణ పాటించారు. ఇళ్లకే పరిమితం అయ్యారు. ఐతే వారిలో చాలామంది గరిష్ఠంగా ఆరు నెలలు మాత్రమే నియంత్రణ పాటించి ఉంటారేమో. 70 ఏళ్లకు చేరువ అవుతూ, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ఇటీవల ఇల్లు దాటి బయటికి వచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై అభిమానులతో సమావేశం నిర్వహించారు. దాని కంటే ముందే ఆయన బయటికి వచ్చినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
కానీ మలయాళ సూపర్ స్టార్లలో ఒకడైన మమ్ముట్టి మాత్రం కరోనా ప్రభావం మొదలైన దగ్గర్నుంచి ఏకంగా 9 నెలల పాటు పూర్తిగా ఇంటికి పరిమితం కావడం విశేషం. కరోనా టైంలో బయట తిరగకూడదని ఒక పట్టుదల పట్టిన ఆయన.. ఈ విషయంలో తనమీద తనకున్న నియంత్రణ ఎలాంటిదో చూపించాలనుకున్నారు. అందుకే ఇంటికి తనను బందీని చేసుకున్నారు.
ఇలాగే మూణ్నెల్లు కాదు.. ఆర్నెల్లు కాదు.. ఏకంగా తొమ్మిది నెలలు ఇంట్లోనే గడిపేశారు. మమ్ముట్టిని ఎవరైనా అత్యవసరంగా కలవాలంటే ఇంటికి వచ్చి కలిశారు తప్ప.. ఆయన మాత్రం బయటికి రాలేదు. ఇలా తొమ్మిది నెలల గృహవాసం పూర్తయ్యాక మమ్ముట్టి ఎట్టకేలకు బయటికి వచ్చారట. తన మిత్రులతో కలిసి ఒక టీ పార్టీ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టారట. త్వరలోనే ఆయన ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.