మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ కుర్రాడు కెరీర్ ప్రారంభంలో కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే చేశాడు. అత్తగారు స్వాగతం, రౌడీ బాబాయ్, ఇంటి దొంగ, దొంగ కాపురం, జీవన గంగ లాంటివి కమర్షియల్ గా బాగానే పే చేశాయి. కానీ తర్వాత వరస ఫెయిల్యూర్స్ రావడంతో త్వరగానే ఇండస్ట్రీ నుంచి మాయమైపోయాడు. లంకేశ్వరుడులో చిరంజీవి చెల్లెలు రేవతి భర్తగా పోలీస్ ఆఫీసర్ వేషంలో కనిపించాక కళ్యాణ చక్రవర్తి దర్శనం మళ్ళీ జరగలేదు.

ఇప్పుడు 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ తెరమీద కళ్యాణ చక్రవర్తి కనిపించనున్నాడు. రోషన్ మేక హీరోగా రూపొందుతున్న ఛాంపియన్ లో రాజి రెడ్డి అనే కీలక పాత్రలో నటించాడు. ఈ మేరకు ఫస్ట్ లుక్ కూడా వదిలారు. పోస్టర్ లో ముప్పై అయిదు అని నెంబర్ వేశారు కానీ నిజానికి ఇంకో రెండేళ్లు ఎక్కువే అయ్యింది. డిసెంబర్ 25 విడుదల కాబోతున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీని వైజయంతి, స్వప్న సంస్థలు నిర్మించాయి. సుదీర్ఘ నిర్మాణం జరుపుకున్న ఛాంపియన్ లో కల్యాణ చక్రవర్తిని చూసి నందమూరి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. బాలయ్యకు తమ్ముడు వరస కాబట్టి కనెక్టివిటీ ఉంటుంది.

ఈ మధ్య ఇలా తెరమరుగైపోయిన పాత హీరోలను బాగానే తీసుకొస్తున్నారు. స్కందలో రామ్ తండ్రిగా నటించిన దగ్గుబాటి రాజా ఈ కోవకు చెందినవాడే. రవితేజ రామారావు ఆన్ డ్యూటీలో వేణు రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆశించిన ఫలితం దక్కపోవడంతో మళ్ళీ తెరమీద కనిపించలేదు. కళ్యాణ్ చక్రవర్తి సోదరుడు హరిన్ చక్రవర్తి యాక్సిడెంట్ లో చనిపోవడం ఆ కుటుంబం మీద తీవ్ర ప్రభావం చూపించింది. కళ్యాణ్ కొడుకు పృథ్వి సైతం రోడ్డు ప్రమాదంలోనే కన్ను మూశారు. చెన్నైలో రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాలు చేసుకుంటున్న సీనియర్ హీరో కంబ్యాక్ ని కొనసాగిస్తారో లేదో చూడాలి.