ఓటిటి ఫ్లాప్‍లు థియేటర్లలోకి!

థియేటర్ల లాక్‍డౌన్‍ సమయంలో ఓటిటి ప్లాట్‍ఫామ్‍లలో విడుదలైన సినిమాల్లో చాలా వరకు ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యాయి. అయితే ఓటిటి యాక్సెస్‍ అనేది సినిమా లవర్స్ అందరికీ లేదు. నగరాల్లో అధికంగా, పట్టణాల్లో ఒక పరిధి వరకు ఓటిటిలు విస్తరించాయి. పల్లెల్లోకి అవి అంతగా చేరలేదు. దీంతో ఓటిటిలో విడుదలైన సినిమాలకు ఆమ్‍ ఆద్మీ తీర్పు ఏమిటనేది ఇదమిత్థంగా తెలియలేదు. అందుకే ఆయా సినిమాల ప్రదర్శన హక్కులు కొన్న ఓటిటి కంపెనీలు ఇప్పుడా సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలని చూస్తున్నాయి.

పంపిణీదారులు వస్తే సినిమా హాల్స్లో విడుదల చేసి ఆయా చిత్రాలకు ప్రేక్షకుల స్పందన ఎలా వుంటుందో చూడాలనుకుంటున్నాయి. తద్వారా తాము పెట్టిన పెట్టుబడిలో కొంతయినా ఇలా గిట్టుబాటు చేసుకోవాలని చూస్తున్నాయి. ఇదిలావుంటే కొత్త సినిమాలను థియేటర్లతో పాటు ప్యారలల్‍గా ఓటిటిలో కూడా విడుదల చేస్తే ఎలా వుంటుందనే కొత్త ఆలోచన మొదలయింది.

హాలీవుడ్‍లో వార్నర్‍ బ్రదర్స్ ఈ నిర్ణయం తీసుకోవడంతో మన నిర్మాతలు, ఓటిటి సంస్థలు కూడా అది ఎంతవరకు లాభదాయకమనే దానిపై ఆలోచన మొదలుపెట్టాయి. ఒకట్రెండు సినిమాలను అలా ప్రయోగాత్మకంగా విడుదల చేసే అవకాశం వుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటిటి కంపెనీల నుంచి పెట్టుబడికి మించిన లాభాలు ఎలాగో వచ్చేస్తున్నాయి కనుక వీలుంటే నిర్మాతలు ఈ రిస్కు తీసుకుని చూడొచ్చు మరి. ఎలాగో మునుపటిలా డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి రావడం లేదు కనుక ఇదో ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే చిత్ర పరిశ్రమ చిక్కుల్లోంచి బయట పడగలుగుతుంది.